కాన్‌బెర్రా: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈనేపథ్యంలో పలు దేశాలు భారత్‌ నుంచి వస్తున్న విమానాలను నిషేధించాయి. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా మే3న భారత విమానాలను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా విధించిన నిషేధం మే 14 అర్ధరాత్రితో ముగిసింది. దీంతో భారత్, ఆస్ట్రేలియాల మధ్య విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభం అయ్యాయి. 80 మందితో భారత్ నుంచి బయలుదేరిన మొదటి విమానం ఆస్ట్రేలియాకు చేరుకుంది.

 అయితే భారత విమానాలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోరిసన్ మాట్లాడుతూ.. కరోనా క్వారంటైన్ కేంద్రాలను దాటకుండా  ఈ నిషేధం ఉపయోగపడిందని, దీని కారణంగా దేశంలో కరోనా వ్యాప్తి తగ్గిందని ఆయన అన్నారు. భారత విమానాలపై నిషేధం విధించడంతో ఆస్ట్రేలియాలో కరోనా మూడో వేవ్ రాకుండా అడ్డుకోగలిగామని మోరిసన్ అభిప్రాయపడ్డారు. అయితే భారత విమానాలపై నిషేధించిన సమయంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆస్ట్రేలియా తన దేశ పౌరులపై కఠిన నిబంధనలు విధించింది.

 భారత్‌లో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తిరిగి తమ దేశంలోకి అడుగు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఇది ఆస్ట్రేలియాలో సంచలనం అయింది. ఇదిలా ఉంటే భారత్‌లో గడిచిన 24 గంటల్లో 3.26 లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసులు సంఖ్య 2.43 కోట్లకు చేరింది. అంతేకాకుండా దేశంలో గడిచిన 24 గంట్లలో 3,980 మంది మరణించారు. అయితే దేశంలో నమోదైన కేసుల్లో 80 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లో నమోదయ్యాయి. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ఒక్క రోజులో 3,53,299 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: