కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆంధ్ర పోలీస్ శాఖ తన విధులు నిర్వర్తించడంలో వెనకగడుగు వేయడం లేదు. కరోనా మహమ్మారి అత్యంత ప్రమాదకరం అయినప్పటికీ పోలీసులు ప్రాణాలకు తెగించి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు. అయితే వీరిలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. గర్భిణీలు కూడా ఇళ్ళకు పరిమితం కాకుండా ప్రజలకు సేవ చేయాలని తమ విధులను తూచా తప్పకుండా నిర్వర్తిస్తున్నారు.

అయితే రాష్ట్రంలోని అన్ని యూనిట్ అధికారులకు డీజీపీ గౌతం సవాంగ్ మహిళా పోలీస్ సిబ్బంది గురించి సరికొత్త ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి గర్భిణీ సిబ్బందికి ఇంటి నుండి పనిచేసే (వర్క్ ఫ్రం హోమ్) వెసులు బాటును కల్పించాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని తెలిపారు. గర్భిణీ సిబ్బంది ఆరోగ్యం గురించి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, అత్యవసర వైద్య సదుపాయాలు అవసరం అయితే వెంటనే అందేవిధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు.

మహిళా సిబ్బంది యోగక్షేమాల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, వారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆయా వివరాలను మంగళగిరిలో ఉన్న చీఫ్ కార్యాలయానికి తెలపాలని చెప్పారు. అంతేకాకుండా డీజీ కార్యాలయం వారి ఆరోగ్య పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షిస్తుందని అన్నారు. అయితే గర్బిణీలల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, కాబట్టి వారికి కరోనా సోకేందుకు ఎక్కువ ఆవకాశాలు ఉన్నాయని, అందుకనే వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.

అంతేకాకుండా వారికి ఎప్పుడు ఎటువంటి అవసరం వస్తుందో తెలియదని, అందుకోసమే వారికి 24 గంటలు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అతడి నిర్ణయానికి మహిళా పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: