వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు గారి అరెస్టుకు సంబంధించిన కీలకమైన స్టేట్‌మెంట్‌ను సీఐడీ విడుదల చేసింది. వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడం, సామాజిక అశాంతిని రేకెత్తించడం, ప్రభుత్వంపై అసమ్మతిని ఎగదొయ్యడం కోసం కుట్ర పూరితంగా వ్యవహరించిన కారణంగా అతడిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ తెలిపింది. అయితే అతడు ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నుతున్నారని సమాచారం లభించిందని, ఆ సమాచారం ఆధారంగా తాము ప్రాథమిక విచారణ జరిపామని సీఐడీ అధికారులు తెలిపారు.


తమ విచారణలో ఆయన కొన్ని ఛానళ్ళతో, కొన్ని సోషల్ మీడియా గ్రూపులతో కుట్రపన్ని తద్వారా సామాజిక అశాంతిని రేకెత్తించడం కోసం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరకమైన కుట్ర చేస్తున్నారని తేలినట్లు సీఐడీ అధికారులు చెప్పారు. అయితే  ఈ కేసులో భాగంగా  రఘురామ కృష్ణం రాజుకు బెయిల్ కావాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ న్యాయస్థానం ఆ పిటీషన్‌ను కొట్టివేసింది. ముందు సీఐడీ కోర్టును ఆశ్రయించమని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.



దాంతో వారు గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ అరెస్టు అక్రమం అని అతడి తరపు న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా అతడి శరీరంపై ఉన్న గాయాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఎంపీ తనను పోలీసులు కొట్టారని లిఖిత పూర్వకంగా పిటిషన్ దాఖలు చేయడంతో అతడిని ముందుగా ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. ఈ సమయంలోనే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు హైకోర్టులో స్పెషల్ మోషన్ మూవ్ చేశారు.


 అయితే రఘురామ తరపు న్యాయవాదులు తాజాగా వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో ఆయన కేసును ప్రత్యేక డివిజన్ బెంచ్ విచారించనుంది. జస్టిస్ ప్రవీణ్ నేతృత్వంలో ఈ స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటు కానుంది. ఈ బెంచ్ ఏర్పాటయిన తరువాత ఈ కేసు విచారణ జరగనుంది. అయితే రఘురామకు గాయాలు మానే వరకు ఆసుపత్రిలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా అతడికి ఉన్న వై-క్యాటగిరీ భద్రతా సిబ్బంది రాఘురామతోనే ఉంటుందని తెలిపింది.



స్పెషల్ డివిజన్ విచారణ ఈలోపు పూర్తయితే ఆయన జైలుకు వెళ్లే అవసరం ఉండకపోవచ్చు.  అయితే తాజాగా రఘురామ కృష్ణం రాజు కేసులో కొత్త మలుపు తిరిగింది. రాఘురామ కృష్ణంరాజును ఈ నెల 28 వరకు రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దీని పర్యవసానం తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: