ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన్ను అరెస్టు చేయడం.. ఆయన కాళ్లకు గాయాలు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. రఘురామను పోలీసులు తీవ్రంగా హింసించారని ఆయన హైకోర్టులో స్పెషల్ మూవ్ పిటిషన్‌ కూడా వేశారు. రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు రఘురామ కోర్టుకు తెలిపారని ఆయన న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే ఆయనను ప్రభుత్వాసుపత్రికి తరలించడానికి తాము అభ్యంతరం చెప్పామని, రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్తామని కోర్టును కోరారు. అయితే కోర్టు రఘురామకృష్ణం రాజుకు 28 వరకూ రిమాండ్ విధించింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌పై తాజాగా బీజేపీ అధికారికంగా స్పందించింది.

రాష్ట్ర పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడిన పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు చిత్రాలు కలతపెట్టేవి మరియు ఖండించదగినవని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని.. పార్లమెంటు సభ్యుడిని ఈ విధంగా రాష్ట్ర పోలీసులు వేధించగలిగితే, రాష్ట్రంలోని సాధారణ ప్రజల స్థితి ఏమిటని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఈ దారుణానికి కారణమైన పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ డిమాండ్ చేస్తోందని వీర్రాజు తెలిపారు.

రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేయడం మరియు రాజకీయ ఎజెండాను నెరవేర్చడానికి రాజకీయ క్రూరత్వాన్ని చూపించడం అప్రజాస్వామిక మరియు ఆమోదయోగ్యం కాదని తాము మరోసారి పునరుద్ఘాటిస్తున్నామన్నారు సోము వీర్రాజు. వైసీపీ  ప్రభుత్వం తన ప్రతీకార చర్యలను ఆపి, ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాజకీయంగా ప్రేరేపించిన ఆరోపణలను ఉపసంహరించుకోవలని సోము వీర్రాజు అంటున్నారు. ఏది ఏమైనా, న్యాయస్థానాల ద్వారా త్వరలో న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్నామని సోము వీర్రాజు ఓ ప్రకటనలో తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: