ఏపీలో కరోనా ఒక వైపు జోరుగా ఉంది. కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో రాజకీయం కూడా ఎక్కడా ఆగడంలేదు. చాలా సాధారణ పరిస్థితులు ఉన్నట్లుగానే పాలిటిక్స్ సాగుతోంది.

ఏపీలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు. ఈ నేపధ్యంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజుని పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి గాయపరచారు అంటూ వచ్చిన వార్తల నేపధ్యంలో ఏపీ రాజకీయం అగ్గిలా రాజుకుంది.

ఏపీలో రాజ్యాంగం సక్రమంగా అమలు కావడంలేదు.అసలు ఏపీలో ఏం జరుగుతోందో తెలియడంలేదు, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి అంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మాజీ మంత్రి  అయ్యన్నపాత్రుడు, కాంగ్రెస్ నేత తులసీరెడ్డి వంటి వారు కూడా ఇదే మాట అంటున్నారు. మరో వైపు రాజు కుమారుడు ఏకంగా కేంద్రానికి లేఖ రాసి తన తండ్రిని పోలీసులు భౌతికంగా హింసించారంటూ ఫిర్యాదు చేశారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా లకు కూడా ఆయన లేఖలు రాయడంతో ఈ వ్యవహారం ఇపుడు కేంద్రం వద్దకు చేరినట్లు అయింది.

మరి దీని మీద కేంద్రం ఏ రకంగా స్పందిస్తుంది అన్నదే చర్చగా ఉంది. మామూలుగా ఇలాంటి అరెస్టులు ప్రతీ చోటా జరుగుతూ ఉంటాయి. వివిధ రాష్ట్రాలలో రాజకీయాలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా కూడా ఉంటాయి. మరో వైపు చూస్తే రఘురామ క్రిష్ణం రాజుకు కేంద్రం అండ ఉందని ఇంతకాలం చెబుతూ వచ్చారు. ఏపీ బీజేపీ నేతలు కూడా ఆయనకు మద్దతుగా ఉన్నారు. ఏపీలోని విపక్షాలు కూడా కేంద్రం జోక్యం కోరుతున్నాయి. మరి కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా అన్నదే ఆసక్తికరమైన చర్చగా ఉందిట. చూడాలి మరి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: