రాజకీయం అన్నాక అధికార పార్టీని వ్యతిరేకించే విప‌క్షం ఉండాలి. అటూ ఇటూ మాటల పోటీ కూడా గట్టిగా ఉండాలి. సమరమే అంటూ వారూ వీరూ నిత్యం సవాళ్ళతో ప్రతి సవాళ్ళతో పాలిటిక్స్ ని హీటెక్కించాలి. ఏపీ వరకూ  చూస్తే ఇవన్నీ రంజుగానే సాగుతున్నాయి.

అయితే విడివిడిగా ఉంటూ కలివిడిగా విపక్షాలు ఏపీలో రాజకీయం చేస్తున్నాయి. ఇంకా సార్వత్రిక ఎన్నికలకు మూడేళ్ళ పైగా  టైమ్ ఉంది కాబట్టి అప్పటి పరిస్థితుల ను బట్టి పొత్తుల ఎత్తులు వేసుకోవచ్చు అని విపక్షాలు ఉన్నాయి. అయితే ఏపీలో జగన్ దూకుడు మాత్రం వారిని విడిగా ఉండనీయడంలేదు. ఏదో ఒక సమస్య ఏపీలో రాజుకుంటోంది. దాన్ని పెంచి పెద్ద చేస్తూ విపక్షాలు రచ్చ చేస్తున్నాయి.

ఆ మధ్య దాకా టెన్త్ ఇంటర్ పరీక్షల మీద విపక్షాలు అన్నీ కూడా గొడవ చేశాయి. రద్దు చేయాలంటూ డిమాండ్ కూడా చేశాయి. అది అయిపోయి కరోనా  వ్యాక్సిన్ కొరత అంటూ దాని మీద యాగీ చేశాయి. ఇపుడు వాటిని మించేలా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగుతోంది. ఈ రెబెల్ ఎంపీకి ఇంత మద్దతు ఉందా అనిపించేలా విపక్షాలు అన్నీ కలసి ఆయన మీద ఈగ వాలితే చూస్తూ ఊరుకోమని అంటున్నాయి.

ఏపీలో టీడీపీ బీజేపీ సీపీఐ, జనసేన , కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలూ జగన్ సర్కార్ మీద మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నాయి. నిజానికి ఏపీలో ఇవన్నీ ఎవరి మటుకు వాటిగానే ఉన్నాయి. ఎవరి పాలిటిక్స్ వారిదే అన్నట్లుగానే సీన్ కూడా ఉంది. కానీ జగన్ దూకుడే వీరిని కలుపుతోంది అంటున్నారు. ఎన్నడూ లేనిది చంద్రబాబు మాట్లాడుతున్న ప్రతీ మాటనూ బీజేపీ పెద్దలూ వల్లె వేస్తున్నారు. అలాగే జనసేన కూడా జగన్ సర్కార్ మీద విరుచుకుపడుతోంది. రాజ్యాంగ వ్యవస్థలు కుప్ప కూలుతున్నాయి అంటూ ప్రతిపక్షాలు ఒక్కటిగానే పెద్ద గొంతు చేస్తున్నాయి. మొత్తానికి చూస్తే ఎన్నికల కంటే ముందే ఈ పార్టీల మధ్య పొత్తు కుదిరేలా జగన్ రాజకీయ దూకుడు ఉంది అంటే ఆశ్చర్యం లేదుగా. మరి కూటమి కట్టి జగన్ తో పోరాడేందుకు ఇంతకంటే మంచి తరుణం కూడా ఉండదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: