రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఇరు రాష్ట్రాల్లోని రాజ‌కీయ పార్టీల మ‌ధ్య వ్యూహ ప్ర‌తివ్యూహాలు, అవ‌గాహ‌న ఒప్పందాలు మాటెలా ఉన్నా సామాన్య ప్ర‌జ‌లు మాత్రం సోద‌రభావంతోనే మ‌నుగ‌డ సాగిస్తున్నారు. ఉద్య‌మ కాలం నాటి ప్రాంతీయ విద్వేషాలు, ఉద్వేగ‌భ‌రిత వాతావ‌ర‌ణం ఇప్పుడు ఎక్క‌డా లేదు.  అయితే కోవిడ్ మ‌హమ్మారి కార‌ణంగా ఉత్ప‌న్న‌మైన దుర‌దృష్ట‌క‌ర ప‌రిస్థితులు, ప్ర‌భుత్వాల వైఖ‌రి ఇప్పుడు మ‌రోసారి ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాల‌కు కార‌ణ‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. రాష్ట్ర సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి వ‌స్తున్న‌ అంబులెన్స్‌లను ఆపినందుకు తెలంగాణలోని టీఆర్ఎస్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ ప్ర‌భుత్వ వైఖ‌రి కార‌ణంగా మెరుగైన వైద్యం కోసం వ‌స్తున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, ప్రాణాలు కోల్పోతున్నార‌ని ఏపీకి చెందిన కొంద‌రు వ్య‌క్తులు హైకోర్టులో  పిల్ వేశారు. హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి… అంబులెన్స్‌ల‌ను ఆప‌డం స‌రికాద‌ని అనుమతించాల్సిందేన‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఈ ప‌రిణామాల‌ తరువాత హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన రోగులు 45 శాతం పడకలను ఆక్రమించినట్టు అక్క‌డి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్ప‌టికే కోవిడ్ బారిన ప‌డిన బాధితుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతుండ‌టంతో వైద్య‌స‌దుపాయాల క‌ల్ప‌న‌కు రాష్ట్ర‌ ప్రభుత్వాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌టంతో ఈ విషయంపై సోషల్ మీడియా లో మ‌రోసారి ప్రాంతీయత అంశం ప్రాధాన్యం సంత‌రించుకుని నెటిజ‌న్ల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన చీలిక తీసుకువ‌చ్చింది. మన సొంత ప్రజల ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డిన స‌మ‌యంలో ఇతర రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్‌లో పడకలను ఆక్రమించటానికి ప్రభుత్వం ఎందుకు అనుమ‌తించాలంటూ కొందరు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు ఏపీ ప్రజల మీద అస‌భ్య‌క‌ర‌మైన‌ పోస్టులకు తెగ‌బ‌డుతున్నారు. ఈ ధోరణి నెమ్మదిగా ప్రాంతీయ విద్వేషానికి దారితీస్తోంద‌న్న ఆందోళ‌న‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

 నిజానికి 2024 వ‌ర‌కు ఏపీకి కూడా ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైదరాబాద్ ఉంటుంద‌న్న విష‌యం ఉద్దేశ‌పూర్వ‌కంగా ప‌లువురు మ‌ర‌చిపోతున్నారు. సామాన్య ప్ర‌జ‌ల మాట ఎలా ఉన్నా రాజ‌కీయ నాయ‌కులు, ముఖ్యంగా ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇలాంటి సున్నిత అంశాల విష‌యంలో మ‌రింత సంయ‌మ‌నంతో, బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఇప్పుడు చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్పాలి. నిజానికి హైదరాబాద్ ఆసుప‌త్రుల్లో ఉన్న రోగులు కేవ‌లం ఏపీకి చెందిన‌వారు మాత్ర‌మే కాదు. ప‌లు ఇత‌ర రాష్ట్రాల‌వారూ ఉన్నారు. అంతేకాదు.. దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల‌న్నింటిలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. కానీ సోష‌ల్ మీడియాలో ఏపీ ప్ర‌జ‌ల అంశాన్నే ప్ర‌స్తావించ‌డం విచార‌క‌ర‌మ‌నే చెప్పాలి. ఇలాంటి సంక్షోభ స‌మ‌యాన్ని అధిగ‌మించాలంటే రాష్ట్రాల మ‌ధ్య మెరుగైన స‌మ‌న్వ‌యం, ప్ర‌జ‌ల మ‌ధ్య ఐక్య‌తాభావం అవ‌స‌ర‌మ‌ని అంద‌రూ గుర్తించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: