కోవిడ్ వైర‌స్ తీవ్ర‌త నేప‌థ్యంలో ఏడాది కాలంగా పెళ్లిళ్ల సంఖ్య బాగా త‌గ్గిపోయిన విష‌యం తెలిసిందే. అక్క‌డ‌క్క‌డా జ‌రిగినా ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఆడంబ‌రాలకు పూర్తి దూరంగా, చాలా త‌క్కువ మంది బంధుమిత్రుల మ‌ధ్య జ‌రుపుకుంటున్నారు. ఈ ప‌రిస్థితుల మ‌ధ్యే ఇటీవ‌ల‌ క‌ర్ణాట‌క‌లోని కోలార్ ప‌ట్ట‌ణంలో జ‌రిగిన ఒక‌ పెళ్లి ఫొటో మాత్రం సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. దీనికి కార‌ణం ఏమిటంటే ఆ పెళ్లిలో వ‌ధువులిద్ద‌రు కాగా వ‌రుడొక్క‌డే. అందుకే ఇది ఆస‌క్తిక‌ర వార్త‌గా మారింది. ఈ కాలంలో కూడా ఇలాంటి వివాహాలు జ‌రుగుతాయా.. అంటే కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల కార‌ణంగా ఇలాంటివి జ‌రుగుతాయ‌ని ఒప్పుకోవాలి మ‌రి.

కోలార్‌కు చెందిన ఉమాప‌తి అనే వ్య‌క్తి ఒకేసారి ఇద్ద‌రు అమ్మాయిల‌ను పెళ్లి చేసుకున్నాడు. విశేష‌మేమిటంటే వ‌ధువులిద్ద‌రూ స్వ‌యంగా అక్కాచెల్లెళ్లే. వారిద్ద‌రూ ఇష్ట‌పూర్వ‌కంగానే ఒకేవ్య‌క్తిని మ‌నువాడారు. వ‌ధువుల్లో ఒక‌రు మూగ కాగా మరొక‌రు వినికిడి లోపంతో ఉన్న యువ‌తి. ఈనేప‌థ్యంలోనే వారిద్ద‌రూ తోడుగా ఒక్క‌చోటే ఉంటేనే మేల‌ని ఆ అమ్మాయిల‌తోపాటుగా వారి త‌ల్లిదండ్రులు కూడా భావించ‌డంతో ఆ దిశ‌గానే వరుడి కోసం వెదికార‌ట‌. వారిద్ద‌రినీ వివాహం చేసుకునేందుకు ఉమాప‌తి అందుకు అంగీరించ‌డంతో మే 7న వారి వివాహం పెద్ద‌ల స‌మ‌క్షంలో సంప్ర‌దాయ‌బ‌ద్దంగా జ‌రిపించారు.

నిజానికి బ‌హుభార్య‌త్వం మ‌న‌దేశంలో మ‌రీ అరుదైన విష‌య‌మేమీకాదు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని తెగ‌ల్లో ఇప్ప‌టికీ ఈ విధానం ఉంది. ఇక పురాణ కాలంలో అయితే ఇది స‌ర్వ‌సాధార‌ణమైన విష‌య‌మే. ప్ర‌స్తుత కాలంలోనూ అక్క‌డ‌క్క‌డా ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి. ఇక ఒక‌రికి తెలియ‌కుండా మ‌రో వివాహం చేసుకునే ప్ర‌బుద్ధుల గురించి, ఆ తరువాత వారిమ‌ధ్య‌ జ‌రిగే వివాదాల గురించీ త‌ర‌చుగా ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి వారితో పోలిస్తే శారీర‌క లోపం ఉన్న యువ‌తుల బాధ్య‌త‌ను స్వీక‌రించిన ఉమాప‌తి ఆద‌ర్శ‌వంత‌మైన వివాహం చేసుకున్న‌ట్టుగానే భావించాల్సి ఉంటుంద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: