నిన్న మొన్నటి వరకూ వ్యాక్సిన్ ఉత్పత్తితో భారత్ బయోటెక్, సీరమ్ ఇన్ స్టిట్యూట్ పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగిపోయాయి. ఇప్పుడు కరోనా వ్యాధి నివారణ ఉత్పత్తుల వ్యవహారంలో డాక్టర్ రెడ్డీస్ పేరు ప్రముఖంగా వినిపించే అవకాశం ఉంది. ఓవైపు స్పుత్నిక్-వి టీకాను అందుబాటులోకి తెచ్చిన ఇదే సంస్థ.. త్వరలో డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధాన్ని కూడా మార్కెట్లోకి తీసుకు రాబోతోంది.

2డీజీ విడుదల నేడే..
డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) ఔషధం ఈరోజు లాంఛనంగా విడుదల కాబోతోంది. తొలి విడతలో 10వేల ప్యాకెట్లు అందుబాటులోకి తెస్తారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఢిల్లీలో వీటిని విడుదల చేస్తారు. రెండో విడతలో భాగంగా మరిన్ని ప్యాకెట్లను ఈ నెల 27, 28 తేదీల్లో విడుదల చేయబోతున్నారు. జూన్‌ నెలలో డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఔషధం పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వస్తుంది.

2డీజీ ఔషధం తయారీ విషయంలో డీఆర్డీవోతో డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. నీళ్లలో కలుపుకొని తాగే ఈ ప్యాకెట్లను మార్కెట్లోకి అందుబాటులోకి తేబోతోంది. ఒక్కో ప్యాకెట్ ధర రూ.600గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఔషధాన్ని గతంలో క్యాన్సర్‌ నివారణ కోసం తయారు చేశారు. శరీరంలో క్యాన్సర్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకుండా ఈ మందు అడ్డుకుంటుంది. ఇదే ఫార్ములాని కొవిడ్‌ వైరస్‌ నివారణకు కూడా అన్వయించి పరిశోధనలు మొదలు పెట్టారు. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్‌ వైరస్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకపోతే కణ విభజన జరగదని.. ఫలితంగా శరీరంలో కరోనా వ్యాప్తి కూడా ఆగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రష్యా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని స్పుత్నిక్-వి టీకాను మార్కెట్లోకి తెస్తున్న డాక్టర్ రెడ్డీస్ సంస్థ, త్వరలోనే దాన్ని దేశీయంగా తయారుచేయబోతోంది. రాబోయే రోజుల్లో స్పుత్నిక్ లైట్ (సింగిల్ డోస్ టీకా) కూడా ఇదే సంస్థ ద్వారా భారత్ లో విడుదలవుతుంది. ఇక ఇప్పుడు 2డీజీ ఔషధం కూడా డాక్టర్ రెడ్డీస్ సంస్థ ద్వారానే మార్కెట్లోకి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: