మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌కు తెరాస‌యేత‌ర పార్టీల నుంచి సానుభూతి వ్య‌క్త‌మ‌వుతుంటే.. ఈట‌ల అంతుచూస్తా అంటూ కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి కాలు దువ్వుతున్నాడు.. త‌న తండ్రిని జ‌డ్పీటీసీగా ఓడించి క‌న్నీరు పెట్టించిన ఈట‌ల‌ను రాజ‌కీయ స‌న్యాసం పుచ్చుకొనేలా చేస్తానంటూ శ‌బ‌దం చేస్తున్నాడు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన కౌశిక్ ప్ర‌త్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌పై ఓట‌మిపాల‌య్యాడు. అయితే ఈట‌ల‌పై త‌న కోపం ఇప్ప‌టిది కాద‌ని ఈట‌ల‌పై రివైంజ్ తీర్చుకొనేందుకు ఎదురుచూస్తున్నాన‌ని, త్వ‌ర‌లో నా కోరిక నెర‌వేరుతుంద‌ని ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల వ‌ద్ద పేర్కొంటున్నార‌ట‌.

ఈట‌ల రాజేంద‌ర్ పై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డంతో సీఎం కేసీఆర్ మంత్రి ప‌ద‌వినుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన విష‌యం విధిత‌మే. అప్ప‌టి నుంచి తెలంగాణలో ఈట‌ల వ‌ర్సెస్ సీఎం కేసీఆర్ అన్న‌ట్లుగా రాజ‌కీయాలు సాగుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌, బీజేపీ నేత‌లు ఈట‌ల‌కు సానుభూతి తెలుపుతూనే.. మిగిలిన మంత్రులు, తెరాస ఎమ్మెల్యేల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పైనా విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కేసీఆర్‌ను డిమాండ్ చేస్తున్నారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి మాత్రం ఈట‌ల పేరు చెబితేనే ఒంటికాలుపై లేస్తున్నాడు. ఈట‌ల బీసీ ముసుగులో ఉన్న రెడ్డి, బీసీల‌ను ఈట‌ల మోసం చేస్తున్నాడంటూ మండిప‌డుతూ వ‌స్తున్నాడు. ఈట‌ల ఒక్క అచ్చంపేట‌లోనేకాక రాష్ట్ర‌వ్యాప్తంగా భూక‌బ్జాల‌కు పాల్ప‌డ్డాడ‌ని, వేల ఎక‌రాలు ఆయ‌న పేరుపై, ఆయ‌న‌ అనుచ‌రుల పేరుపై ఆస్తులు కూడ‌గ‌ట్టాడ‌ని, ఇప్ప‌టికే త‌న‌వ‌ద్ద ఏడువంద‌ల ఎక‌రాల్లో భూక‌బ్జాల‌కు సంబంధించి డాక్యుమెంట్లు ఉన్నాయంటూ కౌశిక్ పేర్కొంటూ వ‌స్తున్నాడు.

కౌశిక్‌రెడ్డి వ్య‌వ‌హారంలో కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌లువురు నేత‌లు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుండ‌గా, మ‌రికొంద‌రు లైట్ తీసుకుంటున్నారు. కౌశిక్‌రెడ్డి మాత్రం త‌న దూకుడును కొన‌సాగిస్తున్నాడు. ఈట‌ల రాజీనామా చేస్తాడ‌న్న ఊహాగానాల నేప‌థ్యంలో ఆయ‌న ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టును మ‌రింత పెంచుకొనేందుకు వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్తున్నాడు. ఈక్ర‌మంలో కౌశిక్ తెరాస‌లోకి వెళ్తాడంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను కొట్టిపారేస్తున్న ఆయ‌న‌.. ఈట‌ల అంతు చూసేవ‌ర‌కు తాను పోరాటం చేస్తానంటూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ ఈట‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపింద‌న‌డంలో నిజంలేద‌న్నారు. ఉప ఎన్నిక‌వ‌స్తే కాంగ్రెస్ నుంచి నేనే బ‌రిలో నిలుస్తాన‌ని, ఈట‌ల‌ను ఓడిస్తాన‌ని కౌశిక్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశాడు. ఈట‌ల‌కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం కానీ, పార్టీలో చేర్చుకోవ‌టం కానీ చేయ‌బోద‌ని, భూక‌బ్జాల‌కు పాల్ప‌డే నేత‌ను ఎలా చేర్చుకుంటార‌ని అన్నారు. ఉప ఎన్నిక వ‌స్తే రాజ‌కీయాల్లో సుధీర్ఘ అనుభ‌వం ఉన్నఈట‌లను యువ‌నేత కౌశిక్ ఎలా ఢీకొట్టి నెగ్గుతాడో వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: