భారత దేశ వ్యాప్తంగా చాలా రోజుల నుంచి భారీ ఎత్తున నమోదవుతున్న కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి అని చెప్పవచ్చు. అయినా సరే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగించే విషయంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన ప్లాస్మా థెరపీ మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు  భిన్నమైన ప్రకటనలు చేస్తూ ఉండడంతో పాటు ఇప్పటివరకు సంజీవనిలా భావిస్తూ వస్తున్న మందుల మీద కూడా భిన్నమైన ప్రకటనలు చేస్తోంది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మరో డ్రగ్ ఈరోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. డిఆర్డిఓ సంస్థ అభివృద్ధి చేసిన 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ)  ఈరోజు నుంచి అందుబాటులోకి రానుంది. 


ఈరోజు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని ఆసుపత్రులలో ఈ డ్రగ్ డోసులను పంపిణీ చేయనున్నారు. అందుతున్న సమాచారం మేరకు మొత్తం పదివేల డోసులు ఈరోజు పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఒక పౌడర్ రూపంలో రానున్న ఈ ఔషధాన్ని మంచి నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వైరస్ ఉన్న కణాలలోకి ఈ డ్రగ్ చేరి అవి అభివృద్ధి కాకుండా అడ్డుకుంటుందని డిఆర్డిఓ చెబుతోంది. 


ఇక ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ ల కొరత వేధిస్తున్న సమయంలో ఈ డ్రగ్ కాస్త ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. సాధారణంగా భద్రతా బలగాలకు వెపన్స్ తయారు చేసే భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పొడిని తయారు చేసింది. భారతదేశంలో దీనిని కరోనా రోగులకు ఎమర్జెన్సీ నిమిత్తం వాడొచ్చని భారత దేశ డ్రగ్ కంట్రోల్ బోర్డు అనుమతి ఇచ్చింది.. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: