ఏపీలో కరోనా కట్టడికి కర్ఫ్యూ అమలు చేస్తున్నా వైరస్ వణికిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 18 గంటల పాటు అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నా ఏ మాత్రం ఉపయోగం ఉండటం లేదు. అత్యవసర, మెడికల్‌ అవసరాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే సుమారు పది రోజుల నుంచి ఈ నిబంధనలు అమలు అవుతున్నా.. కరోనా మాత్రం అదుపులోకి రాలేదు అంతకు మించి కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.  


ఇలాంటి సమయంలో పూర్తి లాక్ డౌన్ విదించాలని కూడా యోచన చేస్తున్నారు. ఇంతలా జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన చెబుతున్నారు.  కరోనా కట్టడికి సీఎం జగన్ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్న ఆయన ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్‌ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి చెబుతున్నారు. 


ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చామని వారి భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. పై రెండు వార్తలు వేరువేరు కానీ, ఒకే ప్రభుత్వ వర్గాల నుంచి వెలువడినవే. నిజానికి కేసుల పెరుగుదలలో ఏపీ 2వ స్థానంలో ఉంది. దేశంలో నిరంతరం కొవిడ్‌ కేసుల పెరుగుదల కనిపిస్తున్న 8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. తమిళనాడు తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలవగ ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌, ఒడిశా, పంజాబ్‌, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్‌, పుదుచ్చేరిలు ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఏపీ ప్రభుత్వం పరీక్షల వెనుక పడుతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడుతుందో ? లేక ఇలాగే మొండిగా ముందుకు వెళ్లి దేశవ్యాప్తంగా టార్గెట్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: