కొవాగ్జిన్ టీకాకు మ‌రోసారి అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించింది. భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన ఈ టీకా భార‌త్‌, బ్రిట‌న్ దేశాల‌కు సంబంధించిన క‌రోనా ర‌కాల‌పై స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు తేలింది. నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ(ఎన్ఐవీ), ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఐసీఎంఆర్ ) సంయుక్తంగా చేసిన అధ్య‌య‌నంలో ఇది వెల్ల‌డైన‌ట్లు భార‌త్ బ‌యోటెక్ తెలిపింది. భార‌త్‌లో వెలుగు చూసిన బి.1, 617, బ్రిట‌న్ ర‌కం బి1. 1.7 ర‌కాల‌ను ఈ వ్యాక్సిన్ అంతం చేయ‌గ‌ల‌ద‌ని  ఒక అధ్య‌య‌నంలో తేలిన‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. శాస్త్రీయ ప‌రిశోధ‌న‌ల త‌ర్వాత కొత్త‌గా వెలుగు చూసిన వేరియంట్ల‌పై ఇది స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు తేలింది. కొవాగ్జిన్ సాధించిన ఘ‌న‌త‌ల్లో ఇది మ‌రొక‌ట‌ని భార‌త్ బ‌యోటెక్ స‌హ వ్య‌వ‌స్థాప‌కురాలు సుచిత్ర ఎల్ల అన్నారు.

కొవాగ్జిన్‌పై మ‌రో కంపెనీ చ‌ర్చ‌లు
వ్యాక్సిన్ త‌యారీకి గుజ‌రాత్ ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు హెస్ట‌ర్ బ‌యో సైన్సెస్ వెల్ల‌డించింది. ఇందుకు సంబందించి ఇప్ప‌టికే కొవాగ్జిన్ త‌యారుచేస్తున్న భార‌త్ బ‌యోటెక్‌తో చ‌ర్చ‌లు ప్రారంభించిన‌ట్లు తెలిసింది. భార‌త్ బ‌యోటెక్ నుంచి సాంకేతిక‌త‌ బ‌దిలీ ద్వారా వ్యాక్సిన్ త‌యారీ అవ‌కాశాలు ప‌రిశీలిస్తున్నామ‌ని హెస్ట‌ర్ బ‌యోసైన్సెస్ సీఈవో, ఎండీ రాజీవ్గాంధీ వెల్ల‌డించారు. పౌల్డ్రీ వ్యాక్సిన్ల త‌యారీలో ఇది దేశంలో రెండో అతి పెద్ద సంస్థ‌.

సాంకేతిక బ‌దిలీకి సిద్ధ‌మైన భార‌త్ బ‌యోటెక్‌

సీరం ఇన్‌స్టిట్యూట్ త‌యారుచేసిన కొవిషీల్డ్ పూర్తిగా ప్ర‌యివేటు కంపెనీకి చెందుతుంది. కానీ భార‌త్ బ‌యోటెక్ త‌యారుచేసిన కొవాగ్జిన్‌కు సంబంధించి భార‌త ప్ర‌భుత్వం పెట్టుబ‌డులు పెట్టింది. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఐసీఎంఆర్‌) ఈ టీకా ఉత్ప‌త్తిలో పాలుపంచుకుంది. నిధులు అంద‌జేసింది. స‌త్వ‌ర‌మే అంద‌రికీ టీకాను అందుబాటులోకి తీసుకురావ‌డానికి సాంకేతిక‌త బ‌దిలీ ఒక్క‌టే త‌రుణోపాయ‌మ‌ని ప్ర‌భుత్వం భావిస్తుండ‌టం.. అందుకు భార‌త్ బ‌యోటెక్ కూడా అంగీక‌రించ‌డంతో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి వేగ‌వంతం కానుంది. ఇప్ప‌టికే రెండు కంపెనీల‌తో సాగించిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌య్యాయి. తాజాగా హెస్ట‌ర్ బ‌యోసెన్సెస్ కూడా చ‌ర్చ‌లు సాగిస్తోంది. ఏదేమైన‌ప్ప‌టికీ అతి త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా కొవాగ్జిన్ టీకాను అందుబాటులోకి తీసుకురావ‌డానికి కేంద్రం ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: