క‌రోనా వైర‌స్ తీవ్రరూపం దాల్చుతుంది. దేశ‌వ్యాప్తంగా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతుండ‌టంతో ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన‌ప‌డి ఆస్ప‌త్రుల బాట‌ప‌డుతున్నారు. వంద‌లాది మంది మృత్యువాత ప‌డుతున్నారు. కొవిడ్ క‌ట్ట‌డికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ‌తో పాటు ప‌లురాష్ట్రాల్లో ఇప్ప‌టికే లాక్‌డౌన్ విధించాయి. దేశ‌వ్యాప్తంగా వాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. దీంతో టీకా వేయించుకొనేందుకు ప్ర‌జ‌లు క్యూ క‌డుతున్నా టీకా కొర‌త‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ కొత్త రూపాలను సంత‌రించుకుంటోంది. తాజాగా కొవిడ్ కొత్త ల‌క్ష‌ణాల‌ను వైద్యాధికారులు గుర్తించారు. ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికిసైతం కొవిడ్ సోకిన‌ట్లేనంటూ వైద్యులు పేర్కొంటున్నారు.

గ‌తేడాది మార్చిలో ప్రారంభ‌మైన క‌రోనా వ్యాప్తి.. కొత్త‌కొత్త రూపాల్లో రూపాంత‌రం చెందుతోంది. గ‌తేడాది కొద్దిపాటి ల‌క్ష‌ణాల‌ను ఈ వైర‌స్ సోకింద‌న‌టానికి ప‌రిగ‌ణ‌లోకి తీసుకొనేవారు. ఈ ఏడాది సెకండ్‌వేవ్‌లో మ‌రికొన్ని ల‌క్ష‌ణాలు క‌లిశాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జ్వ‌రం, ద‌గ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, జ‌లుబు, వాస‌న‌తో పాటు రుచి తెలియ‌క‌పోవ‌డం కొంద‌రిలో క‌ళ్లు ఎర్ర‌బార‌డం వంటివి క‌రోనా ల‌క్ష‌ణాలుగా గుర్తించారు. ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు టెస్టులు చేయించుకొనేందుకు కొవిడ్ కేంద్రాల‌కు ప‌రుగులు తీస్తున్నారు. తాజాగా వైద్యులు మ‌రికొన్ని ల‌క్ష‌ణాలను గుర్తించారు. ఈ కొత్త ల‌క్ష‌ణాలు ఉండ‌టం వ‌ల్ల కూడా క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు అనుమానించాల్సి ఉంటుంద‌ని వైద్యులు పేర్కొంటున్నారు.

కొవిడ్ సోకిన వారిలో తాజాగా నోరు ఎండిపోవ‌డం, నాలుక‌పై గాయాలు, నాలుక దుర‌ద, మంటగా అనిపించ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ క‌రోనా కొత్త ల‌క్ష‌ణాల‌ను కొవిడ్ టంగ్‌గా పిలుస్తున్నారు. ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిలో ఎక్కువ‌గా నీరసంతో పాటు విప‌రీత‌మైన అల‌స‌ట ఉంటుంద‌ట‌. ఈ రెండు ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి వైద్యులు ప‌లు విధాలుగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ అని తేలింద‌ట‌. అయితే ఈ ల‌క్ష‌ణాల‌పై లోతైన అధ్య‌య‌నం జ‌ర‌గాల్సి ఉంద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా అనుమానం వ‌స్తే వెంట‌నే క‌రోనా టెస్టు చేయించుకోవ‌టం మంచిద‌ని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: