ఏపీలో రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు అరెస్ట్ తో ఒక్క సారిగా రాజకీయాలు హీటెక్కాయి. నాలుగు రోజుల క్రితం పుట్టిన రోజు వేడుకలలో బిజీగా ఉన్న రాజుని హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్ళి మరీ ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విధితమే.

ఆ తరువాత ఏపీలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. విపక్షం మొత్తం జగన్ సర్కార్ మీద విరుచుకుపడుతూ వచ్చింది. అరెస్ట్ అక్రమం అంటూ రచ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే రఘురామ రాజు ఏడాదిన్నరగా  జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రతీ రోజూ ఆయన రచ్చ బండ పేరిట జగన్ ప్రభుత్వాన్ని, పార్టీని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. మరి ఆయన వైసీపీ గుర్తు మీద గెలిచారు. అలాంటిది సొంత పార్టీ మీద ఎందుకు ఇలా చేశారు అన్నదే చర్చ.

నిజానికి వైసీపీలో రాజు మొదట్లో బాగానే ఉండేవారని చెబుతారు. కానీ తనకు  పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరుకునే వారు. అయితే అందరు ఎంపీలనూ సమానంగానే చూస్తూ వైసీపీ అధినాయకత్వం ముందుకు పోతోంది. ఈ నేపధ్యంలో రాజులో ఒక విధమైన అసంతృప్తి బయల్దేరిందని చెబుతారు.

సరిగ్గా దాన్ని క్యాష్ చేసుకుని ఇద్దరు ఎంపీలు ఆయన్ని  రెచ్చగొట్టారు అని ప్రచారం సాగుతోంది. ఆ ఇద్దరి కారణంగానే రాజు ప్రతీ రోజూ ఢిల్లీలో ఠంచనుగా ప్రెస్ మీట్లు పెడుతూ తన సొంత ప్రభుత్వాన్ని పార్టీని విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన వ్యవహార శైలి పట్ల మొదట్లో చూసీ చూడనట్లుగా వ్యవహరించిన వైసీపీ అధినాయకత్వం తరువాత గీత దాటారు అన్న కారణంతో ఆయన ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేసింది.

అది అక్కడ పెండింగులో ఉంది. ఆ తరువాత మరింత ధాటీగా రాజు వైసీపీ మీద విమర్శలు చేశారు. దీంతో పాటు సమాజంలోని కొన్ని కులాలను, మతాలనూ ఆయన టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారని సీఐడి అధికారులు కేసు నమోదు చేశారు. మొత్తానికి చూస్తే రాజు ఇలా ఫైర్ బ్రాండ్ అవడం వెనక బలమైన  ఇద్దరు ఎంపీలు ఉన్నారని అంటున్నారు. ఆ ఇద్దరి విషయం కూడా సీఐడీ దర్యాప్తులో తేలుతుంది అని చెబుతున్నారు. మొత్తానికి రాజుని ముందు పెట్టి వెనక ఎవరో జగన్ సర్కార్ ని అభాస్ పాలు చేయాలనుకున్నారని అంటున్నారు.  మరి  ఆ కుట్రని చేదించే పనిలోనే ఇపుడు సీఐడీ అధికారులు ఉన్నారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: