ఈట‌ల రాజేంద‌ర్‌ను మంత్రి ప‌ద‌వినుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంపై తెరాస అధిష్టానం ఫోక‌స్ పెట్టింది.  త్వ‌ర‌లో ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజీనామా చేస్తార‌న్న ఊహాగానాల నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలోని ఏ ఒక్క తెరాస నేత‌ను ఆయ‌న వెంట వెళ్ల‌కుండా అధిష్టానం ప‌క‌డ్బందీ వ్యూహాలు అమ‌లు చేస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బాధ్య‌త‌ల‌ను మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ భుజానికెత్తుకున్నారు. ఈట‌ల వెంట ఎవ‌రూ వెళ్ల‌కుండా తెరాస ముఖ్య‌నేత‌ల‌తో వ‌రుస భేటీలు అవుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఏ అభివృద్ధి ప‌నులు కావాల‌న్నా నేను చేస్తాన‌ని, ప్ర‌తీఒక్క‌రూ పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండాలంటూ తెరాస శ్రేణుల‌కు సూచిస్తున్నారు.

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క‌సారిగా రాజ‌కీయం వేడెక్కింది. గంగుల వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ అన్న‌ట్లుగా అక్క‌డి రాజ‌కీయాలు సాగుతున్నాయి. దీంతో తెరాస శ్రేణులు రెండు వ‌ర్గాలుగా చీలిపోయారు. ప‌లువురు జ‌డ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీ, స‌ర్పంచ్‌లు ఇటీవ‌ల గంగుల క‌మ‌లాక‌ర్‌తో భేటీ అయ్యారు. తామంతా కేసీఆర్ వెంటే ఉంటామ‌ని, పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో క్ర‌మంగా ఈట‌ల అనుచ‌రులుగా ముద్ర‌ప‌డిన వారు ఒక్కొక్క‌రుగా ఆయ‌న దూర‌మ‌వుతున్నారు. ఈట‌ల‌సైతం గంగుల‌ వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు ర‌చిస్తూ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌ట్టును కోల్పోకుండా ఉండేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో జ‌మ్మికుంట మున్సిపాలిటీ వైస్ చైర్మ‌న్‌ల‌తో పాటు ప‌లువురు కౌన్సిల‌ర్లు స‌మావేశ‌మై తాము ఈట‌ల వెంట ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

నియోజ‌క‌వ‌ర్గంలో ఈట‌ల వ‌ర్సెస్ గంగుల వ‌ర్గీయులుగా తెరాస శ్రేణులు విడిపోవ‌టంతో రాజ‌కీయం ర‌స‌ర‌వ‌త్త‌రంగా మారింది. ఇరువ‌ర్గీయులు ఒక‌రిపై ఒక‌రు మాట‌ల దాడికి దిగుతున్నారు. ఈ క్ర‌మంలో ఈట‌ల రాజేంద‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గొర్రెల మంద‌మీద తోడేళ్ల దాడిచేసిన‌ట్లు ఉందంటూ ప‌రోక్షంగా గంగుల‌ను ప్ర‌స్తావిస్తూ వ్యాఖ్యానించారు. దీనికి కౌంట‌ర్‌గా వీణ‌పంక‌లో ఈట‌ల వ్య‌తిరేఖ వ‌ర్గం ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఈ విష‌యం తెలుసుకున్న ఈట‌ల వ‌ర్గీయులు అక్క‌డిచేరుకొని అడ్డుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. కేసీఆర్ జిందాబాద్ అంటూ ఒక‌ప‌క్క‌, ఈట‌ల జిందాబాద్ అంటూ మ‌రోప‌క్క నినాదాల‌తో హోరెత్తించారు. ఈ క్ర‌మంలో పోలీసులు ఇరువ‌ర్గీయుల‌ను అక్క‌డినుండి పంపించివేశారు. ఇలా హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో నువ్వానేనా అన్న‌ట్లుగా ఈట‌ల వ‌ర్సెస్ గంగుల మ‌ధ్య రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: