తిరుమ‌ల శ్రీ‌వారిని క‌నులారా ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి వేల కిలోమీట‌ర్లు, వంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి వ‌చ్చే భ‌క్తులుంటారు. ఒక ప‌దిసెక‌న్లు ఉండే ద‌ర్శ‌నం అయిన త‌ర్వాత ప‌డిన‌ క‌ష్టం మ‌రిచిపోతుంటారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత అనిపిస్తుంటుంది.. అరే.. ద‌ర్శ‌నం ఇంకా చాలాసేపు ఉంటే బాగుండేది క‌దా.. అని. ఆ అవ‌కాశం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఇప్పుడు భ‌క్తుల‌కు క‌ల్పిస్తోంది. ఎంత ర‌ద్దీ త‌క్కువున్నా శ్రీవారి ద‌ర్శ‌నం పూర్తి కావ‌డానికి కొన్ని గంట‌ల స‌మ‌యం ప‌డుతుండ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం. సాధార‌ణ రోజుల్లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం అర‌గంట‌లో పూర్త‌వుతుంది. ఇప్పుడు మాత్రం వీఐపీలు కాక‌పోయినా వారిక‌న్నా  ఎక్కువ‌గా 15 నుంచి 20 నిముషాల్లోనే ద‌ర్శ‌న‌మైపోతోంది.

భ‌క్తుల సంఖ్య త‌గ్గ‌డంతో..
కొవిడ్ కార‌ణంగా వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య త‌గ్గిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమ‌ల‌వుతుండ‌గా.. మ‌న రాష్ట్రంలో క‌ర్ఫ్యూ అమ‌లవుతోంది. ఈ నేప‌థ్యంలో చిత్తూరు జిల్లాతోపాటు చుట్టుప‌క్క‌ల‌ జిల్లాల వాళ్లే  స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌స్తున్నారు. రోజుకు 20 వేల మందిని ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్న‌ప్ప‌టికీ 5 వేల మందికి మించి రావ‌డంలేదు. దీంతో భ‌క్తుల‌ను క్యూ లైన్లలో కాకుండా నేరుగా సింహద్వారం నుంచే పంపిస్తున్నారు. ఇది ఒక‌ర‌కంగా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం లాంటిదే. దీంతో 20 నిమిషాల్లోనే ద‌ర్శ‌నం పూర్తి చేసుకొని భ‌క్తులంతా త‌న్మ‌య‌త్వానికి లోన‌వుతున్నారు.

మ‌ళ్లీ మ‌ళ్లీ ల‌భించ‌క‌పోవ‌చ్చు..!
ఒక‌ప్పుడు స‌ర్వ‌ద‌ర్శ‌నం కోసం రెండు రోజులు ప‌ట్టిన సంద‌ర్భాలున్నాయి. దూర ప్రాంతాల నుంచి వ‌చ్చిన‌వారికి స‌రైన స‌మాచారం ల‌భించ‌క కొండ‌పై నుంచి మ‌ళ్లీ కింద‌కు వెళ్లి టిక్కెట్లు వేయించుకొని వ‌చ్చేవారు. గ‌దులు దొర‌క్క నానా ఇక్క‌ట్లు ప‌డి స్వామివారి ద‌ర్శ‌నానికి వెళ్లేవారు. అటువంటి ప‌రిస్థితి నుంచి కొవిడ్ పుణ్య‌మా అని నిలువెత్తు నామాల‌స్వామిని క‌ళ్ల‌తోనే నిలువు దోపిడీ చేసుకునే భాగ్యం ల‌భిస్తోంది. కొవిడ్ ఉధృతంగా వ్యాపిస్తున్నా సొంత వాహ‌నాలు క‌లిగిన భ‌క్తులు తిరుమ‌ల‌కు బ‌య‌లుదేరి వెళుతున్నారు. ఈ త‌ర‌హా ద‌ర్శ‌నం మ‌ళ్లీ మ‌ళ్లీ ల‌భించ‌క‌పోవ‌చ్చు అనే కార‌ణంతో కొంద‌రు దైర్యం చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: