పెళ్లి అనేది జీవితంలో కీలక ఘట్టం. ప్రతీ మనిషి తన జీవిత భాగస్వామిని పొందే తరుణం. ఇలాంటి వేడుకను అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సాక్షిగా చేసుకోవాలనుకుంటారు. కానీ కరోనా వైరస్ కారణంగా పెళ్లిళ్లు తూతుమంత్రంగా జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్లిళ్లు కొద్దిమంది సమక్షంలోనే కోవిడ్ నియమాలను పాటిస్తూ చేసుకుంటున్నారు. ఇక వారికీ పెళ్లి అయ్యింది అని వాళ్ళు చెప్పుకునే వరకు తెలియడం లేదు. ఈ మధ్య.. ఇలా.. చాలా పెళ్లిళ్లే జరుగుతున్నాయి. బంధుమిత్రుల మాట దేవుడెరుగు.. కనీసం పక్కింటోళ్లకు కూడా తెలియకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి పెళ్లిళ్లు చిన్నపాటి గొడవలకు, అలకలకూ దారితీస్తున్నాయి.



ఇక జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన కుమారుడి పెళ్లి కోసం అన్ని సిద్ధం చేసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు కల్యాణం అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు.. పెళ్లితో పాటు రిసెప్షన్‌ పార్టీ కూడా తామే ఇవ్వాలని, ఆ ప్రకారం ఫంక్షన్‌హాల్, గార్డెన్‌ రెండింటినీ మూణ్ణెళ్ల ముందే బుక్‌ చేశారు. పెళ్లి పత్రికలనూ హైదరాబాద్‌ నుంచి తెప్పించి ముద్రించారు. వధూవరులతో పాటు ఇంటిల్లిపాదికీ హైదరాబాద్‌లో షాపింగ్‌ చేశారు. విందులు, వంటకాల కోసం వంట సామగ్రి కూడా ముందే తెచ్చేసుకున్నారు. ఇక మరో పదిరోజుల్లో పెళ్లి ఉందనగా.. కరోనా తీవ్రత పెరుగుతూ పోయింది.



అయితే తమ దగ్గరి బంధువులే కోవిడ్‌ బారిన పడ్డారు. చేసేది లేక వివాహాన్ని ఒక నెల వాయిదా వేసుకున్నారు. నెల గడిచిపోయింది. కానీ కరోనా తగ్గలేదు కదా.. పైనుంచి లాక్‌డౌన్‌ పడింది. దీంతో ఏంచేయాలో పాలుపోలేదు. మళ్లీ వాయిదా వేద్దామంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనన్న అనుమానం. దీంతో ఫంక్షన్‌హాల్, గార్డెన్, వంటలు, డెకరేషన్, బ్యాండ్, డీజే.. ఇలా అన్నీ క్యాన్సిల్‌ చేశారు. ఇంటి ముందే రోడ్డుపై చిన్న టెంటు వేసి దగ్గరి బంధుమిత్రులు అంతా కలిపి ఓ 50మందితో పెళ్లితంతు ముగించేశారు. ఇలా జిల్లాలో చాలా కల్యాణాలు ఇప్పుడు ఇలాగే మమ అన్నట్లుగా సాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: