మయామి, ఫ్లోరిడా సెమినోల్ హార్డ్ రాక్ హాలీవుడ్‌ హోటల్లో ఆదివారం నాడు 3 గంటల పాటు జరిగిన ఉత్కంఠభరితమైన "మిస్‌ యూనివర్స్ 2021" అందాల పోటీలలో 26 ఏళ్ల మెక్సికో భామ ఆండ్రియా మేజా 73 మందిని ఓడించి విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆండ్రియా మేజా మిస్‌ యూనివర్స్ కిరీటం పొందిన మూడో మెక్సికన్‌గా చరిత్ర సృష్టించారు. మెక్సికన్ దేశస్థురాలు లుపిటా జోన్స్ 1991లో మిస్ యూనివర్స్ టైటిల్ దక్కించుకోగా.. 2010లో జిమెనా నవారేట్ అనే మరొక మెక్సికన్ విశ్వసుందరి కిరీటాన్ని పొందారు.


ఐతే ఫలితాలు ప్రకటించగానే ఆండ్రియా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అనంతరం దక్షిణాఫ్రికా దేశస్థురాలు, మాజీ విశ్వసుందరి జొజిబిని తుంజి ఆండ్రియా తలపై కిరీటం తొడిగారు. దీంతో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని తన తలపై మోస్తూ రెడ్ కార్పెట్ పై నడుస్తూ ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది కరోనా వ్యాప్తి దృష్ట్యా మిస్ యూనివర్స్ అందాల పోటీలు నిర్వహించలేదు. దీంతో జొజిబిని తుంజి అత్యధిక రోజులు విశ్వసుందరిగా కొనసాగారు.


అందం అనేది కేవలం శరీర సౌందర్యంలో మాత్రమే ఉండదని మనుషుల హృదయాల్లో కూడా ఉంటుందని చెప్పిన ఆమె ప్రజలు తమను తాము ఎలా ప్రేమిస్తారనే దానిపై కూడా అందం ఆధారపడి ఉంటుందని అన్నారు. మనం ఎలా ప్రవర్తిస్తున్నామనే దానిలో కూడా అందం ఉంటుందని.. మీరు విలువైన వారు కాదని ఎవర్ని చెప్పనివ్వకండని ఆమె సమాధానాలు చెప్పడంతో న్యాయనిర్ణేతలు మంత్రముగ్ధులయ్యారు.



కాగా, 69వ మిస్‌ యూనివర్స్ పోటీల్లో బ్రెజిల్ దేశస్థురాలు జూలియా గామా మొదటి రన్నర్-అప్ గా నిలిచారు. పెరూ దేశస్థురాలు జానిక్ మాసెటా సెకండ్ రన్నర్-అప్ గా నిలిచారు. ఇక మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన అడిలైన్ క్యాస్టిలినో(22) మూడో రన్నరప్‌గా నిలిచారు. డొమినికన్ రిపబ్లిక్ మిస్ కింబర్లీ పెరెజ్ నాలుగో రన్నర్-అప్ గా నిలిచారు. ఇకపోతే మహిళా హక్కుల కోసం ఆండ్రియా మేజా కృషి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: