2019 ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజుకు జగన్ టిక్కెట్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రతిపక్ష టీడీపీ నేతల నుంచి ఎక్కువగా వస్తుంది. అయితే ఈ ప్రశ్న గురించి మాట్లాడుకునే ముందు, అసలు రాజుగారు ఎంపీగా గెలిచాక ఏం చేశారనే విషయంలోకి వెళితే, 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ, కొన్నిరోజుల పాటు పార్టీలో బాగానే నడిచారు. కానీ తర్వాత రాజుగారు పూర్తిగా ప్రతిపక్ష నాయకుడుగా మారిపోయారు. డైలీ మీడియా సమావేశం పెట్టి జగన్ ప్రభుత్వాన్ని తిడుతూనే ఉన్నారు.


మొదట సొంత పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు. అక్కడ నుంచి చూసుకుంటే ప్రతిరోజూ రచ్చబండ పేరిట మీడియా సమావేశం పెట్టడం ప్రభుత్వంపై విమర్శలు చేయడం చేస్తున్నారు. ఇక ఇటీవల రాజుగారి విమర్శలు హద్దులు దాటేశాయి. సీఎం జగన్‌ని వ్యక్తిగతంగా తిట్టడం మొదలుపెట్టారు. అలాగే రెడ్డి సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. దీంతో ప్రభుత్వం రాజుగారిపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసింది.


ప్రస్తుతం ఆయన సి‌ఐడిస కస్టడీలో ఉన్నారు. అయితే ఇక్కడ రాజుగారు అరెస్ట్ అవ్వడాన్ని వైసీపీ ఫుల్‌గా సమర్ధిస్తుంది. అసలు ఇంతకాలం రాజుగారు, చంద్రబాబు డైరక్షన్‌లో పనిచేస్తూ జగన్‌పై విమర్శలు చేశారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక వైసీపీకి కౌంటర్‌గా టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. రాజుగారిని కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఏం జరిగిన చంద్రబాబుని తిట్టడం వైసీపీ నేతలకు అలవాటైపోయిందని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.


రఘురామకృష్ణంరాజుకి నర్సాపురం ఎంపీ టిక్కెట్ ఇవ్వమని చంద్రబాబు, సీఎం జగన్‌తో చెప్పారా? అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిలదీశారు. రఘురామకృష్ణంరాజుతో ఆయన ప్రాణాలకు హాని ఉందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే  ఆ విషయాన్ని చంద్రబాబుకి అంటగడతారా? అని ప్రశ్నించారు. హత్యారాజకీయాలు, వేధింపులు, కక్షసాధింపులు, కులమతాల మధ్యచిచ్చులు చంద్రబాబుకి తెలియవని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఎవరు ఎలా మాట్లాడినా రెండు పార్టీలు మాత్రం పూర్తిగా రాజకీయం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: