మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆదినారాయణ...వైఎస్సార్ అండతో 2004లో జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లో సైతం ఆదినారాయణరెడ్డి విజయం సాధించారు. అయితే తర్వాత వైఎస్సార్ మరణించడం, జగన్ వైసీపీ పార్టీ పెట్టడంతో అందులోకి వెళ్ళిపోయారు.


ఇక 2014 ఎన్నికల్లో ఆదినారాయణ వైసీపీ నుంచి విజయం సాధించారు. అయితే ఇక్కడ నుంచే ఆదినారాయణ రాజకీయ జీవితం మలుపులు తిరిగింది. చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీలోకి వచ్చేశారు. జగన్‌ని కాదని చెప్పి టీడీపీలో చేరి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. మంత్రి అయ్యాక నారాయణ ఏ రేంజ్‌లో జగన్‌పై విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే.


అలాగే తన చిరకాల ప్రత్యర్ధి రామసుబ్బారెడ్డితో సైతం చేతులు కలిపారు. అయితే ఆదినారాయణ దెబ్బకు, రామసుబ్బారెడ్డి ప్రాధాన్యత తగ్గింది. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి చంద్రబాబు కొత్త వ్యూహంతో ముందుకొచ్చారు. రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు బరిలో దింపగా, కడప పార్లమెంట్ బరిలో ఆదినారాయణని బరిలోకి దించారు. అయితే ఈ ఇద్దరు నేతలు జగన్ వేవ్‌లో చిత్తుగా ఓడిపోయారు.


నెక్స్ట్ జగన్ అధికారంలోకి రావడంతో ఆదినారాయణ టీడీపీలో ఉంటే సేఫ్ కాదని భావించి జాతీయ పార్టీ అయిన బీజేపీలోకి వెళ్ళిపోయారు. అటు రామసుబ్బారెడ్డి కూడా టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో చంద్రబాబు, పులివెందులతో పాటు జమ్మలమడుగు బాధ్యతలని బీటెక్ రవికి అప్పగించారు.


పులివెందులలో టీడీపీ పరిస్తితి ఏంటో చెప్పాల్సిన పని లేదు. ఇక జమ్మలమడుగులో టీడీపీ నాయకత్వం చాలా వీక్‌గా ఉంది. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో జమ్మలమడుగులో టీడీపీ నుంచి పోటీచేసే నాథుడే లేడంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆదినారాయణ మాత్రం బీజేపీ తరుపున అభ్యర్ధులని నిలబెట్టి వైసీపీకి పోటీ పెట్టారు.


అయితే ఇక్కడ ఆదినారాయణ బీజేపీలో ఉండటం వలన పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి కాస్త పోటీ ఇవ్వాలంటే ఆయన టీడీపీలో ఉంటేనే వర్కౌట్ అవుతుందని అంటున్నారు. లేదంటే ఇక్కడ వైసీపీకి తిరుగుండదని తెలుస్తోంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఆదినారాయణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: