దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మోడీ లాంటి బలమైన ప్రధాని అధికారంలో ఉన్న వేళ దేశ రాజకీయాల్లో ఇప్పటి దాకా మరో గొంతుక వినిపించేది కాదు. అందరూ ఆయన ముందు అంగుష్టమాత్రులుగా కనిపించేవారు.

అయితే కరోనా సెకండ్ వేవ్ తరువాత మాత్రం ఒక్కసారిగా మోడీ మీద మోజు తగ్గింది అన్న విశ్లేషణలు వస్తున్నాయి. మోడీ ని ఏడేళ్ల నాడు ఎత్తుకున్న వర్గాలే ఇపుడు కొంత వ్యతిరేకతను చూపిస్తున్నాయని చెప్పాలి. రెండవ దశ కరోనాను మోడీ సర్కార్ సరిగ్గా అంచనా వేయలేదని ఓ వైపు విపక్షాలు ఘాటైన పదజాలంతో విమర్శలు చేస్తున్నాయి. ఇక మొదటి దశ కరోనా తరువాత దేశంలో చాలా వర్గాలు దెబ్బతిన్నాయి. వారు ఇప్పటికీ కోలుకోవడంలేదు.

ఈ నేపధ్యంలో మోడీ మీద వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని అపోజిషన్ క్యాంప్ తహతహలాడుతోంది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. మోడీ వ్యూహాలను ఎపుడూ తక్కువ అంచనా వేయకూడదు. మోడీ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అది ఆయన రాజకీయ చాతుర్యమనే చెప్పాలి. ఇక మోడీ మీద వ్యతిరేకత 2021లో వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు 2024లో జరుగుతాయి.

దానికి మూడేళ్ళ దాకా టైమ్ ఉంది. రాజకీయ పార్టీలకు ఇది సుదీర్ఘమైన కాలంగా చెప్పాలి. నిజానికి 2019 ఎన్నికలకు ముందు కూడా విపక్షాలు పుంజుకున్నట్లుగా అనిపించినా ఆఖరి రెండు నెలలలో పరిస్థితి పూర్తిగా మారింది. పుల్వామా దాడులతో రగిలిన దేశ భక్తి బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్లుగా మారాయని చెబుతారు. మరి కేవలం రెండు నెలల్లోనే సీన్ మారితే చేతిలో మూడేళ్ల వ్యవధి ఉంది. అందువల్ల మోడీ అమిత్ షా ఏమైనా చేయగలరు అన్న ధీమా బీజేపీలో ఉంది. మరో వైపు ఇప్పటికీ విపక్ష శిబిరం అస్తవ్యస్థంగానే ఉంది. అక్కడ బహు నాయకత్వం ఉంది. పెద్ద పోటీ ఉంది. దాంతో కిచిడీ పార్టీలతో ఏర్పడే సర్కార్ల మీద జనాలకు ఒక రకమైన వ్యతిరేకత ఎపుడూ ఉంటుంది. కాంగ్రెస్ కనుక గట్టిగా పుంజుకుని రెండు వందలకు పైగా సీట్లు తెచ్చుకుంటే యూపీయే త్రీ ఏర్పాటు అయ్యే చాన్స్ ఉంది. అంతే తప్ప ప్రాంతీయ పార్టీలు ఎంత బలపడినా బీజేపీకి పోటీ కాదు అంటారు. మొత్తానికి చూసుకుంటే ఈ రకమైన విశ్లేషణలే బీజేపీలో గెలుపు ధీమాను పదిలంగా ఉంచుతున్నాయని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: