న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్టు, త‌ద‌నంత‌రం ఒక‌దానివెంట ఒక‌టిగా జ‌రుగుతున్న‌ ప‌రిణామాలు థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తున్నాయి. ఏపీ సీఐడీ అధికారులు, ప్రభుత్వం చ‌ట్ట‌ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని, చివ‌ర‌కు కోర్టు ఉత్త‌ర్వుల‌ను త‌మ‌కు అనుకూలంగా అన్వ‌యించుకుని ఎంపీని క‌క్ష‌పూరితంగా హింస‌కు గురి చేస్తున్నార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్న నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం చివ‌ర‌కు సుప్రీం కోర్టుకు చేరిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఏపీ సీఐడీ అధికారులు ఎంపీ రఘురామరాజును హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ద‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంలో ర‌ఘురామ‌రాజును గ‌మ‌నిస్తే ఒక ఆస‌క్తిక‌ర‌మైన దృశ్యం క‌నిపించింది. ఎంపీ ర‌ఘురామ‌రాజు కారులో ఉన్నంతసేపు త‌న మీసంపై చేయి తీయ‌లేదు. అదేప‌నిగా అది మెలేస్తూ క‌నిపించారు. మీడియా కెమేరాలు క‌నిపిస్తే చాలు ఆయ‌న మ‌రింత ఫోక‌స్డ్‌గా అదే ప‌ని చేశారు. త‌ద్వారా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాల‌నుకుంటున్నార‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ మీడియా వ‌ర్గాల్లో క‌నిపించింది. ఇంత జ‌రిగాక కూడా ఆయ‌న ప్ర‌భుత్వంపై త‌న పోరాడ‌టంలో ఏమాత్రం వెన‌క్కు త‌గ్గేది లేదని సూచించారా లేక‌.., ప్ర‌భుత్వాన్ని మ‌రింత రెచ్చ‌గొట్ట‌డమా అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ప్ర‌భుత్వాదేశాల మేర‌కు సీఐడీ అధికారులు తనను బలవంతంగా జైలుకు పంపాలని చేసిన ప్ర‌య‌త్నాల‌ను తాను విజ‌య‌వంతంగా అడ్డుకోగ‌లిగాన‌న్న ఉద్దేశంతోనే ఆయనిలా మీసం తిప్పి ఉంటారని ప‌లువురు అంటున్నారు. ప్రభుత్వం త‌న‌పై క‌క్ష తీర్చుకోవాల‌ని అనుస‌రించిన వైఖ‌రి బెడిసికొట్టడంతో నైతికంగా తాను విజయం సాధించానని చెప్పడం కూడా ఆయన ఉద్దేశం అయి ఉంటుందని నాయకులు విశ్లేషిస్తున్నారు.
వైసీపీ ప్ర‌భుత్వాన్ని అస్థిర ప‌ర‌చే కుట్రకు పాల్పడుతున్నారంటూ ఎంపీ ర‌ఘురామరాజును రెండు రోజుల క్రితం ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో ని ఆయ‌న నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చ‌ట్ట‌విరుద్దంగా సాగుతున్నాయంటూ  రాజు కుటుంబ స‌భ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సోమ‌వారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌ను వెంట‌నే సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి త‌ర‌లించాల‌ని, ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వ‌హించాల‌ని కూడా అత్యున్న‌త స్థానం సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వానికి కొంత‌కాలంగా కొర‌క‌రాని కొయ్య‌గా మారిన సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ‌రాజు వ్య‌వ‌హారం.. ఇంకా ఎన్ని ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌కు, సంచ‌ల‌నాల‌కు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: