పిచ్చికుదిరింది.. త‌ల‌కు రోక‌లి చుట్టుకోమ‌న్నాట్ట.. వెన‌క‌టికెవ‌డో..! కొంత‌మంది ప్ర‌జాప్ర‌తినిధుల వ్యాఖ్య‌లు, వారు అనుస‌రించే వైఖ‌రి చూస్తే ఇలాగే ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం దేశాన్ని క‌రోనా వైర‌స్ వ‌ణికిస్తోంది. ఇప్ప‌టిదాకా ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నాన్ని క‌బ‌ళించింది. ఇప్ప‌టికీ నిత్యం మూడు ల‌క్ష‌లకు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌గా , నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్య సౌక‌ర్యాలు లేక ప‌లువురు ఇబ్బందులు ప‌డుతున్నారు. వ్యాక్సిన్ల కోసం కోట్ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు. అయితే ఇవేమీ మ‌తం మ‌త్తులో మునిగిన కొంద‌రు నేత‌ల‌కు క‌నిపించ‌డంలేదు. బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఈకోవ‌లోకే వ‌స్తారు. త‌ర‌చుగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో క‌నిపించే ఈ మ‌హిళా ఎంపీ కోవిడ్ వైర‌స్ నియంత్ర‌ణ‌కు ఓ గొప్ప మందును క‌నిపెట్టారిప్పుడు. అదేమిటో తెలుసా..? గోమూత్రం. అవును ఇదే క‌రోనా వైర‌స్‌ను త‌రిమేస్తుంద‌ట‌.

ఈవిడ చెప్పే సూక్తుల ప్ర‌కారం ఇక కోవాగ్జిన్లు కోవిషీల్డ్‌లు, రెమ్‌డెసివిర్లు ఏవీ అక్కర లేదు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు గోమూత్రం తాగితే చాలట. అదీ దేశీ గోమూత్రం అయితేనే ఫలితాలు ఉంటాయని మ‌రచిపోకూడ‌దు మ‌రి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఇచ్చిన సలహా ఇది. అంతేకాదు.. తాను రోజూ గోమూత్రం తీసుకుంటాన‌ని, అందుకే కరోనా ఇంతవరకు తన దరి జేరలేదని కూడా సెల‌విచ్చారీవిడ‌. ఈ మాట‌లు న‌మ్మే మూఢ‌భ‌క్తుల సంఖ్య ఏమాత్ర‌మో తెలియ‌దుగానీ, ఇంత గొప్ప విష‌యం మన వైద్యనిపుణులకు, ప్ర‌భుత్వాల‌కు ఇంకా తెలియకపోవ‌డం ఆశ్య‌ర్య‌మే క‌దామ‌రి. రోజూ గోమూత్రం తాగితే కరోనా వల్ల ఊపిరి తిత్తుల్లో ఏర్పడ్డ జబ్బు నయమైపోతుందని, గోమూత్రం అపర సంజీవనిలా ప‌ని చేస్తుంద‌ని ఆమె నొక్కి చెప్ప‌డాన్ని జ‌నం ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచించాల్సిందే. ఈ ప్ర‌చారం ఈవిడ ఇప్పుడే మొదలుపెట్టార‌నుకుంటే మ‌నం ప‌ప్పులో కాలేసిన‌ట్టే. గోమూత్రంతో మరికొన్ని గోపదార్థాలు కలిపి సేవిస్తే తనకు కేన్సర్ తగ్గిందని రెండేళ్ల క్రితమే ప్రగ్య ప్రకటించారు. 2020 డిసెంబర్ లో కోవిడ్ లక్షణాలతో ఆమె ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరి చికిత్స కూడా తీసుకున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇలాంటి మూర్ఖ‌పు ప్ర‌చారాల‌ను ఏ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఆశించి వీరు చేస్తున్నారోగానీ, వీటిని న‌మ్మితే ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోవ‌డం మాత్రం ఖాయ‌మ‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. ఇలాంటి విష‌యాల‌ను న‌మ్మి ఆచ‌ర‌ణ‌లో పెట్టి ప్రాణాల మీద‌కు తెచ్చుకోవగద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్‌-19కు వ్య‌తిరేకంగా రోగనిరోధక శక్తిని గోమూత్రం, పేడ అందిస్తాయని ఎక్కడా రుజువు కాలేదని ఐఎంఏ అధిపతి డాక్టర్ జేఏ జయలాల్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: