సీఎం జ‌గ‌న్ తాజాగా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల‌ను కేంద్రంలోని మంత్రుల వ‌ద్ద ప్ర‌స్తావించారు. ఎప్ప‌టి నుంచో ఎటూ తేల‌కుండా ఉన్న దిశ చ‌ట్టం, మూడు రాజ‌ధానులు, జిల్లాల ఏర్పాటు, పోల‌వ‌రం నిధులు, వీటితోపాటు.. వెనుక‌బ‌డిన జిల్లాల అభివృద్ధి నిధులు.. ఇలా.. అనేక అంశాల‌ను ఆయ‌న ఢిల్లీలో పెద్ద‌ల వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. అదే స‌మ‌యంలో కీల‌క‌మైన మ‌రో విషయం జోలికి జ‌గ‌న్ పోక‌పోవ‌డంపై వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.


అదేంటంటే.. 2019-20 మ‌ధ్య ఏపీ శాస‌న మండ‌లిని ర‌ద్దు చేస్తూ.. సీఎం జ‌గ‌న్ కేబినెట్ నిర్ణ‌యం తీసుకోవ‌డం.. రాత్రికి రాత్రి దీనిపై ఒక నోట్ రూపొందించి.. తెల్ల‌వారి శాస‌న స‌భ‌లో ఆమోదించ‌డం.. దీనికి కేంద్రానికి పంపించ‌డం తెలిసిందే. మూడు రాజ‌ధానులు స‌హా.. సీఆర్డీఏ ర‌ద్దు చ‌ట్టాల‌కు మండ‌లిలో పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త ఎదురైన నేప‌థ్యంలో జ‌గ‌న్ రాత్రికి రాత్రి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మేధావులు లేని స‌భ‌.. అవ‌స‌రం లేద‌ని.. పేర్కొంటూ.. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది.


అయితే.. ఈ ర‌ద్దును కేంద్రం ఆమోదించి.. పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్టి.. ఆమోదిస్తే.. ఆటోమేటిక్‌గా ఏపీ శాస‌న మండ‌లి ర‌ద్దు అవుతుంది. కానీ, ఇప్ప‌టికి ఏడాది అవుతున్నా.. ఏపీ ప్ర‌భుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన మండ‌లి ర‌ద్దు అంశాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. మండ‌లి ర‌ద్దు అంశాన్ని కూడా ప్ర‌స్తావిస్తున్నార‌నే వార్తలు వ‌చ్చేవి. అయితే.. ఈ ద‌ఫా మాత్రం జ‌గ‌న్ ఎక్క‌డా మండ‌లి ర‌ద్దు విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ల‌లేదు.


పైగా.. రాను రాను మండ‌లిలో ఖాళీ అవుతున్న సీట్లు వైసీపీకే ద‌క్కుతుండ‌డం.. తాజాగా చైర్మ‌న్‌, డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌వులు కూడా వైసీపీకి వ‌స్తుండ‌డంతో జ‌గ‌న్ ఇక‌, ర‌ద్దు విష‌యం మ‌రిచిపోయిన‌ట్టేన‌ని.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. పైగా జ‌గ‌న్ ఎమ్మెల్సీల‌తో పాటు ఇత‌ర ప‌ద‌వులు హామీ ఇచ్చిన నేత‌ల సంఖ్య వంద‌కు పైగా ఉంది. ఈ క్ర‌మంలోనే మండ‌లి ర‌ద్దు తేనె తుట్టెను తానే అన‌వ‌స‌రంగా క‌దిపి.. సొంత పార్టీ నేత‌ల్లో వ్య‌తిరేక‌త కొని తెచ్చుకోవ‌డం కూడా ఇప్పుడు అన‌వ‌స‌రం అని జ‌గ‌న్ దాదాపు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇదే విష‌యాన్ని వైసీపీ నాయ‌కులు కూడా ఆస‌క్తిగా చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: