ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాస్తుల వ్య‌వ‌హారంలో హెటెరో, అర‌బిందో కేసులో నిందితుడిగా ఉన్న అర‌బిందో కంపెనీ మాజీ కార్య‌ద‌ర్శి పి.ఎస్‌.చంద్ర‌మౌళి మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని స‌మ‌ర్పించాల‌ని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్‌కు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీచేసింది. హెటెరో, అర‌బిందోపై ఈడీ న‌మోదు చేసిన కేసు సీబీఐ కోర్టు ముందుకు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ కేసులో 17వ నిందితుడిగా ఉన్న చంద్ర‌మౌళి ఏప్రిల్ 10న మృతిచెందారు. ఆయ‌న మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశించింది. అభియోగాల న‌మోదు కోసం కేసును వాయిదా వేసింది.

డిశ్చార్జి పిటిష‌న్ల‌పై విచార‌ణ ఈనెల 15కు వాయిదా
అక్ర‌మాస్తుల కేసుకు సంబంధించి విచార‌ణ‌లో త‌న త‌ర‌ఫున మ‌రో వ్య‌క్తిని అనుమ‌తించాలంటూ జ‌గ‌న్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ కూడా విచార‌ణ‌కు వ‌చ్చింది. సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఈ కేసు విచార‌ణ‌ను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది. వాన్‌పిక్‌, జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లో పెట్టుబ‌డుల‌పై సీబీఐ న‌మోదు చేసిన కేసుల విచార‌ణ‌ను,  రాంకీ కేసులో రెండో నిందితుడైన విజ‌య‌సాయిరెడ్డి డిశ్చార్జి పిటిష‌న్ల వాద‌న‌ల కొన‌సాగింపున‌కు విచార‌ణ‌ను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది.

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటు వేయండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున న‌ర‌సాపురం నుంచి లోక్‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన ర‌ఘురామ‌కృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్ ఓంబిర్లాను వైసీపీ చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్ కోరారు. ఈమేర‌కు ఆయ‌న స‌భాప‌తిని క‌లిసి ఫిర్యాదు చేశారు. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు ఎంపీ పాల్ప‌డుతున్నార‌ని, పార్టీపై, పార్టీ అధినేత‌, ఇత‌ర నేత‌ల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబందించి గ‌తంలోనే ఆధారాలు స‌మ‌ర్పించామ‌ని భ‌ర‌త్ స్పీక‌ర ఓంబిర్లాకు గుర్తుచేశారు. ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు కోసం ఇప్ప‌టికే ప‌లుమార్లు ఫిర్యాదు చేశామ‌ని, పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టాన్ని అతిక్ర‌మించిన ఎంపీపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్ర‌కారం అన‌ర్హ‌త వేటువేయాల‌ని భ‌ర‌త్ స్పీక‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: