రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్సీల విష‌యం మ‌రోసారి రాజ‌కీయ కాక పుట్టిస్తోంది. శాస‌న స‌భ్యుల ప్రాతినిధ్యంతో ఉండే మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇవి పూర్తిగా వైసీపీకే ద‌క్క‌కున్నాయి. వాస్త‌వానికి ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఎన్నిక పూర్తి చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం వాయిదా వేసింది. అయితే.. ఈ మూడు సీట్ల‌కు భారీ ఎత్తున పోటీ ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఎవ‌రికి ఈ పీఠాలు ద‌క్కుతాయ‌నే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. ఇక్కడ ఖాళీగా ఉన్న‌ది మూడు స్థానాలే అయినా రేసులో ఉన్న నేత‌ల సంఖ్య మాత్రం చాంతాడంత ఉంది.


మ‌రీ ముఖ్యంగా ఒక్క గుంటూరు జిల్లా నుంచే ముగ్గురు నాయ‌కులు ఈ ఎమ్మెల్సీ స్థానాల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. వీరిలో ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఒక‌రైతే.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు టికెట్ త్యాగం చేసిన‌.. గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ లేళ్ల అప్పిరెడ్డి మ‌రొక‌రు. వీరితోపాటు.. కొన్నాళ్లుగా పార్టీ త‌న‌ను గుర్తించ‌డంలేద‌ని.. త‌న సేవ‌ల‌ను స‌రిగా వినియోగించుకోవ‌డం లేద‌నే అస‌హ‌నంతో ఉన్న మోదుగుల వేణుగోపాల‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు.


ఈ ముగ్గురిలో రాజ‌శేఖ‌ర్ క‌మ్మ నేత కాగా, మిగిలిన ఇద్ద‌రు రెడ్డి వ‌ర్గం నేత‌లు. ఇక వీరిలో లేళ్ళ అప్పిరెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖాయమైపోయింది. మరి ఇక మోదుగుల, మర్రిల పరిస్తితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే మోదుగుల మాత్రం ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ కండువా క‌ప్పుకుని గుంటూరు ఎంపీగా పోటీ చేసి జ‌య‌దేవ్ చేతిలో స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. కొంత కాలంగా మోదుగుల కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ఇక మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ చిల‌క‌లూరిపేట సీటు త్యాగం చేసినందుకు జ‌గ‌న్ స్వ‌యంగా ఎమ్మెల్సీతో పాటు మంత్రిని చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌నకు మంత్రి ప‌ద‌వి కాదు క‌దా ?  క‌నీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌లేదు.


ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవ‌రికి ఎమ్మెల్సీ పీఠం ద‌క్కుతుంద‌నేది వైసీపీలోనే కీల‌క చ‌ర్చ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేత‌లు ఓసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారుకావ‌డంతో.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యం ఆస‌క్తిగా మారింది. అయితే.. ఆది నుంచి ఎదురు చూస్తున్న మ‌ర్రిరాజ‌శేఖ‌ర్‌కు ఇప్పుడైనా న్యాయం జ‌రుగుతుందా?  లేదా? అనేది చూడాలని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, మోదుగుల‌కు అవ‌కాశం ద‌క్కే ఛాన్స్ లేద‌ని.. ఆయన పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నార‌ని అనేవారు కూడా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: