దాడి వీరభద్రరావు...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన దాడి వరుసగా అనకాపల్లి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. అలాగే చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికల ముందు బాబుపై తీవ్ర విమర్శలు చేసి జగన్ పెట్టిన వైసీపీలోకి వెళ్లారు.


2014 ఎన్నికల్లో దాడి తనయుడు రత్నాకర్ విశాఖ నార్త్ నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. పైగా చంద్రబాబు అధికారంలోకి రావడంతో జగన్‌ని తిట్టేసి, మళ్ళీ టీడీపీలోకి జంప్ కొట్టారు. 2019 ఎన్నికల ముందు మళ్ళీ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే జగన్ మాత్రం దాడి ఫ్యామిలీకి టిక్కెట్ ఇవ్వలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన కూడా దాడి ఫ్యామిలీని పట్టించుకోవడం లేదు.


ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే, స్థానిక సంస్థలు, గవర్నర్ కోటాలు కలిపి 15 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇవన్నీ వైసీపీకే దక్కనున్నాయి. ఇప్పటికే గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలని దాదాపు భర్తీ చేసేశారు. ఇక మిగిలిన వాటికి వైసీపీలో చాలా పోటీ ఉంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందేమో అని దాడి చూస్తున్నట్లు తెలుస్తోంది.


కానీ జగన్ మాత్రం దాడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే యోచన చేయడం లేదని తెలుస్తోంది. నిలకడగా రాజకీయం చేయని దాడిని జగన్ దూరం పెట్టినట్లే తెలుస్తోంది. పైగా అనకాపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమర్నాథ్‌కు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో దాడిని వైసీపీ వర్గాలే దూరం పెట్టినట్లు కనబడుతోంది. మొత్తానికైతే దాడికి జగన్ ఎలాంటి ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. మరి భవిష్యత్‌లో వైసీపీలో దాడి వీరభద్రరావు రాజకీయం ఎలా ఉండబోతుందో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: