అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్సీ పదవుల కోలాహలం మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అలాగే ఈ నెలలోనే స్థానిక సంస్థల కోటాలో 8 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. తాజాగా గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కరోనా నేపథ్యంలో ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.  


అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అయిన బీద రవిచంద్ర యాదవ్, శ్రీనివాస్, శమంతకమణి, టిడి జనార్ధన్ పదవీకాలం తాజాగా ముగిసింది. కాకపోతే ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తి అయిన నలుగురు టీడీపీకి చెందిన వారే. అయితే గతేడాది శమంతకమణి టీడీపీని వైసీపీలో చేరిపోయారు. మామూలుగా వైసీపీలో చేరేవారు పదవులకు రాజీనామా చేయాలి. అలా డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీతలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరారు.


వైసీపీలోకి వచ్చాక తిరిగి ఆ పదవులు వాళ్ళకే దక్కాయి. కానీ శమంతకమణి పదవికి రాజీనామా చేయకుండా తన కుమార్తె యామిని బాలతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక తాజాగా శమంతకమణి పదవీకాలం పూర్తి అయింది. కానీ జగన్ మాత్రం మళ్ళీ ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. గవర్నర్ కోటాలో తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్, లేళ్ళ అప్పిరెడ్డిలకు ఎమ్మెల్సీలు ఖరారైపోయాయి.


ఈ లిస్ట్‌లో శమంతకమణి పేరు మాత్రం లేదు. అయితే ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఒకవేళ అప్పుడు గానీ జగన్, శమంతకమణికి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. అప్పుడు కూడా ఛాన్స్ దొరకపోతే శమంతకమణి వైసీపీ నాయకురాలుగా ఉండిపోవాల్సిందే. అటు ఆమె కుమార్తె యామిని బాలకు కూడా భవిష్యత్‌లో టిక్కెట్ వచ్చేలా కనిపించడం లేదు. 2014లో యామిని, శింగనమల నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో టిక్కెట్ రాలేదు. దీంతో ఎన్నికలయ్యాక తన తల్లితో కలిసి వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో యామినికి ఎలాంటి పదవి రాలేదు. శింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దూకుడుగా ఉన్నారు. కాబట్టి ఆ సీటు మళ్ళీ యామినికి దక్కడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: