ఆయన్ని మరాఠా యోధుడు అంటారు. చాలా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనది. కాంగ్రెస్ లో ఢక్కామెక్కీలు తిన్న నేతలు ఉండగా సీఎం పదవిని తనదైన వ్యూహాలతో దక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి వేరు పడి కలసి మళ్ళీ విడిపోయి ఇలా శరద్ పవార్ రాజకీయం చాలా చిత్రంగా సాగిపోయింది.

ఆయనను అపర‌ చాణక్యుడు అని పిలవాలి. ఆయన ప్రధాని పదవి కోసం పాతికేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఉన్నత పదవి ఆయనకు దక్కలేదు. ఇక  కాంగ్రెస్ లో సోనియా ఆగమనం తరువాత పవార్ ఆమెతోనే గొడవ పెట్టుకుని బయటకు వచ్చారు. అయితే ఆయన కాంగ్రెస్ లో కొన్నాళ్ళు ఉండి ఉంటే ప్రధాని అయ్యేవారేమో. అయినా కూడా తనదైన లౌక్యంతో యూపీయేలో ఆయన కేంద్ర మంత్రిగా కీలకమైన శాఖలు చూశారు.

ఇవన్నీ ఇలా ఉంటే శరద్ పవార్ కి ఇపుడు వయసు ఎనభై దాటేసింది. ఆయనకు ప్రధాని పదవి మీద ఆశలు కూడా అడుగంటాయి. కాంగ్రెస్ పుంజుకుని ఉంటే ఆ అండతో కొంత అయినా నెట్టుకువచ్చేవారు. కానీ దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగిపోతోంది. దాంతో ఇపుడు పవార్ కన్ను ఏకంగా రాష్టపతి భవన్ మీద పడిందిట. తన వయసుకు అనుభవానికి అదే తగిన చోటు అని ఆయన భావిస్తున్నారుట.

వచ్చే ఏడాది అంటే 2022లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. జూలైలో జరిగే ఆ ఎన్నికల కంటే ముందే యూపీ, పంజాబ్ వంటి చోట్ల ఎన్నికలు ఉన్నాయి. యూపీలో బీజేపీ కనుక ఓడితే తన అభ్యర్ధిని రాష్ట్రపతి పదవికి గెలిపించుకోలేదు అన్న చర్చ ఉంది. రాష్ట్రపతి ఎన్నికలకు కీలకమైన  ఎలట్రోల్ కాలేజీలో బీజేపీకి ఓట్లు తగ్గుతాయి అని కూడా అంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ వద్దనే శరద్ పవార్ కి ఆశలు పెరుగుతున్నాయట.

దేశంలో విపక్షాల బలం ఎక్కువగా ఉండడంతో పాటు యూపీ, పంజాబ్ లలో విపక్షాలు గెలిస్తే తాను రాష్ట్రపతి అభ్యర్ధిగా దిగిపోవచ్చునని భావిస్తున్నారుట. విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా శరద్ పవార్ దిగితే గట్టి పోటీయే ఉంటుంది. ఆయన్ని తట్టుకుని బీజేపీ వ్యూహాలు వేసి గెలవడం అంటే కష్టమే. మొత్తానికి పవర్ రాష్ట్రపతిగా నెగ్గితే మాత్రం మోడీ పవర్ కి సూపర్ పవర్ లా మారుతారు అన్న మాటా ఉంది. మరి ఈ వృద్ధ నేత ఆశలు నెరవేరేనా.



మరింత సమాచారం తెలుసుకోండి: