నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు....జగన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచే అదే పార్టీకి వ్యతిరేకంగా రాజుగారు ఎప్పటినుంచో ముందుకెళుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ చేయని విధంగా రఘురామ, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే రఘురామ కేవలం చంద్రబాబు డైరక్షన్‌లో నడుస్తూ, జగన్‌ని నెగిటివ్ చేయాలని చూస్తున్నారని వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అలాగే ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు.


అయినా సరే రఘురామ వెనక్కితగ్గకుండా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఏపీ సి‌ఐ‌డి ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి, అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన రఘురామ ఏ విధంగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ముందుకెళుతున్నారో కూడా తెలిసిందే. అలాగే తనని సి‌ఐ‌డి పోలీసులు కొట్టి, హింసించారని కేంద్రానికి ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తున్నారు.


అయితే జైలుకు వెళ్ళక ముందు వరకు రచ్చబండ పేరిట మీడియా సమావేశాలు పెట్టి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన రాజుగారు, జైలు నుంచి బయటకొచ్చాక రూటు మార్చారు. మీడియాతో మాట్లాడే విషయంలో ఆంక్షలు ఉండటంతో రఘురామ, వరుసపెట్టి సీఎం జగన్‌కు లేఖస్త్రాలు సంధిస్తున్నారు.


ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు విషయంలో లేఖలు రాస్తున్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వారం లోపే సి‌పి‌ఎస్ రద్దు చేస్తానని జగన్ చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయిన దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే ప్రతి ఏడాది పెన్షన్ రూ.250 పెంచుకుంటూ పోతానని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చలేదు. అలాగే షాదీ ముబారక్, పెళ్లి కానుక ఆర్ధిక సాయాన్ని లక్షకు పెంచుతానని హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా అలాగే ఉంది. ఇక వీటిపై రఘురామ వరుసపెట్టి  జగన్‌కు లేఖలు రాస్తున్నారు. వీటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


అయితే ఈ అంశాలపై ప్రతిపక్ష టీడీపీ ఎప్పటికప్పుడు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. కానీ జగన్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రఘురామ ఈ టాపిక్స్ మాట్లాడుతున్నారు. రాజుగారు మాట్లాడటం వల్ల ఇవి బాగా హైలైట్ అయ్యే అవకాశాలున్నాయి. జగన్ సైతం మాట తప్పుతున్నారనే భావన ప్రజల్లో వచ్చే ఛాన్స్ ఉంది. మరి చూడాలి రఘురామ లేఖలపై జగన్ ఎలా స్పందిస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: