నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం. చాలా ఏళ్ళు కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన కిరణ్‌కు వైఎస్సార్ మరణం, రోశయ్యకు వయసు మీద పడటంతో ఉమ్మడి ఏపీ సీఎంగా అవకాశం దక్కింది. అయితే ఈయన సీఎంగా ఉండగానే రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోకుండా చేయడానికి కిరణ్ గట్టిగానే ట్రై చేశారు. కానీ కుదరలేదు. దీంతో కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేసి, జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి, 2014 ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయి, అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు.


అయితే కిరణ్ రాజకీయాల్లో కనిపించకపోయిన ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం అనూహ్యంగా టీడీపీలో చేరిపోయారు. ఇక టీడీపీలో కిషోర్ కీలకంగా మారిపోయారు. 2019 ఎన్నికల్లో కిషోర్ టీడీపీ తరుపున పీలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కేవలం 7 వేల ఓట్ల తేడాతో కిషోర్ ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక కూడా టీడీపీలోనే కంటిన్యూ అవుతున్నారు. తన అన్న కిరణ్ మళ్ళీ కాంగ్రెస్‌లోకి వెళ్లినా సరే కిషోర్ మాత్రం టీడీపీలో రాజకీయం చేస్తున్నారు.


ఇక టీడీపీ తరుపున యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో పీలేరులో గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అలాగే పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇటీవల తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ తరుపున ప్రచారం చేశారు.


ప్రస్తుతం పీలేరు వైసీపీ ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. ఈయన గత రెండు పర్యాయాలు నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పీలేరులో చింతలదే పైచేయిగా ఉంది. కానీ పీలేరు నల్లారి ఫ్యామిలీకి అనుకూలమైన నియోజకవర్గం. 2014లోనే కిషోర్ సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి 56 వేల ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచారు. 2019లో జగన్ వేవ్‌లో 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాబట్టి పీలేరులో కిషోర్ ఎప్పుడైనా పుంజుకునే అవకాశం ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో కిషోర్, చింతలకు చెక్ పెడతారేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: