ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌రిస్థితి తీవ్ర ఇర‌కాటంగా మారింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన `మాట‌`లే ఆయ‌న‌కు ఇప్పుడు రాజ‌కీయంగా తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు విప‌రీత‌మైన హామీలు గుప్పించారు జ‌గ‌న్‌. అదే స‌మ‌యంలో పార్టీ నేత‌ల‌కు కూడా అనేక హామీలు ఇచ్చారు. కొంద‌రిని పోటీ నుంచి త‌ప్పించేందుకు ప‌ద‌వుల ఆశ చూపించారు. మ‌రికొంద‌రికి పార్టీ ప‌ద‌వుల హామీలు ఇచ్చారు.


ఇక‌, రాష్ట్రంలో అధికారం అందిపుచ్చుకునేందుకు.. జ‌గ‌న్ ఇచ్చిన హామీల్లో కీల‌క‌మైన‌వి.. ఆర్థిక‌ప‌ర‌మైనవి కాగా.. మ‌రికొన్ని రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అయితే.. ఇచ్చిన మాట కోసం.. ప్ర‌తి ఏటా సంక్షేమ కార్య‌క్ర‌మాల పేరుతో .. ప్ర‌జ‌లకు ఆయ‌న నిధులు పంచుతున్నారు. దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. అదేస‌మ‌యంలో రాష్ట్ర అభివృద్ధి మాటేంటి?  ఎలా ముందుకు సాగుతుంది?  వ‌చ్చిన నిధులు వ‌చ్చిన‌ట్టు సంక్షేమానికి మ‌ళ్లిస్తే.. ఆర్థిక ప‌రిస్థితి ఏంటి? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది.


అయితే.. ఈ విష‌యంలోఏం చేయాలో కూడా సీఎం జ‌గ‌న్‌కు కానీ, ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డికి కానీ.. తెలియ‌డం లేదు. ఇక‌, ప్ర‌త్యేక హోదా, మూడు రాజ‌ధానులు, జిల్లాల ఏర్పాటు వంటి విష‌యాలు త‌న చేతుల్లో లేక‌పోవ‌డంతో జ‌గ‌న్ డిల్లీ పెద్ద‌ల‌పైనే ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్ప‌టికి రెండేళ్లు పూర్త‌యినా.. వీటిపై కేంద్ర పెద్ద‌ల నుంచి ఎలాంటి హామీ ల‌భించ‌లేదు. పైగా హోదా విష‌యాన్ని ముగిసింద‌నే చెబుతున్నారు. దీంతో ప్ర‌జ‌ల ప‌రంగా, రాష్ట్రం ప‌రంగా జ‌గ‌న్ మాట నిల‌బెట్టుకునేందుకు కుస్తీ ప‌డుతున్నార‌నేది వాస్త‌వం.


ఇక‌, పార్టీ ప‌రంగా చూసుకుంటే.. చాలా మంది నేత‌ల‌ను గ‌త ఎన్నిక‌ల స‌మయంలో పోటీ నుంచి త‌ప్పించారు జ‌గ‌న్. ఇలా త‌ప్పించిన వారికి ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇస్తామ‌ని.. త‌ర్వాత కొంద‌రికిమంత్రి ప‌ద‌వులు కూడా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే.. ఇలా హామీ ఇచ్చిన వారిలో కొంద‌రికి ఇప్ప‌టికి న్యాయం జ‌ర‌గలేదు. దీంతో వారు కూడా జ‌గ‌న్ మాట నెర‌వేర్చ‌క‌పోతారా? అంటూ.. ఎదురు చూస్తున్నారు. ఇలా.. అన్ని వైపుల నుంచి కూడా మాట కోసం జ‌గ‌న్ ఒత్తిడిని ఎదుర్కొనాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డ‌డం గ‌మ‌నార్హం. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో ఎన్ని హామీలు ఆయ‌న నెర‌వేర్చుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: