తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని జరిగిన ప్రచారం నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్న ఆయన ఈ రోజు జరిగిన కార్యకర్తల సమావేశంలో మాత్రం పార్టీ మార్పుకు సంబంధించి కొన్ని హింట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలోని టిడిపి క్యాడర్ తో సమావేశమైన రమణ పార్టీ మార్పుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. పార్టీలో ఉన్న కార్యకర్తలు అభిప్రాయాలను రమణ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.


 అలాగే ఈ సందర్భంగా కార్యకర్తలతో ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది, ఇతర పార్టీలోకి వెళితే ఏమి ఆశించి వద్దని ఆశించి వెళితే నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చినట్టు సమాచారం. రమణ ఏది ఆశించడం లేదని పేర్కొన్న ఆయన ఎమ్మెల్సీలు మంత్రి పదవులు ఇస్తారని అంటూ జరుగుతున్న ప్రచారం మీద మాత్రం ఆశలు పెట్టుకోవద్దని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఒకప్పుడు మంత్రిగా పనిచేశా, ఎంపీగా పనిచేశా ఆ తర్వాత మళ్ళీ జిల్లా కమిటీలో మెంబర్గా కూడా పని చేశానని ఈ విషయాలన్నీ కార్యకర్తలు గుర్తుంచుకోవాలని కోరారు. 


నా పని నచ్చి చంద్రబాబు నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని తాను ఎక్కడ ఉన్నా నీట్ గానే ఉంటా అని పదవులకోసం అయితే ఎప్పుడో అధికార పార్టీలో చేరే వాడినని ఆయన కార్యకర్తలకు చెప్పినట్లు సమాచారం. ఎంత చేసినా టిడిపి ముందుకు వెళ్లడం లేదు కాబట్టి పదవుల కోసం కాకపోయినా ప్రజలకు సేవ చేసేందుకు పార్టీ మారుతానంటూ ఆయన కార్యకర్తలకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ పార్టీ మారడం నిజమే అయితే ఈ నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: