దగ్గుబాటి పురంధేశ్వరి...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకురాలు. ఎన్టీఆర్ కుమార్తెగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్యగా రాజకీయాల్లోకి వచ్చిన పురంధేశ్వరి చాలా ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బాపట్ల ఎంపీగా పోటీ చేసి, దగ్గుబాటి రామానాయుడుపై విజయం సాధించారు. ఎంపీగా పురంధేశ్వరి మంచి పనితీరే కనబర్చారు.


ఇక 2009 ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అలాగే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో పురంధేశ్వరి కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీలు పొత్తులో పోటీ చేశాయి. ఈ క్రమంలోనే ఆమె రాజంపేట ఎంపీగా పోటీ చేశారు. అయితే అనూహ్యంగా పురంధేశ్వరి ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయాక బీజేపీలో కీలక నాయకురాలుగా పనిచేస్తూ వచ్చారు.


టీడీపీతో పొత్తులో ఉన్నా సరే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అలాగే పొత్తు విడిపోయాక ఓ రేంజ్‌లో బాబు ప్రభుత్వంపై విరుచుకుపడుతూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలో దిగింది. ఈ క్రమంలోనే పురంధేశ్వరి విశాఖపట్నం ఎంపీగా మరోసారి పోటీ చేశారు. కానీ అనూహ్యంగా చిన్నమ్మ డిపాజిట్లు కోల్పోయారు. పట్టుమని 30 వేల ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. అయితే ఇప్పటికీ చిన్నమ్మ బీజేపీలోనే కొనసాగుతున్నారు. అటు పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పర్చూరులో పోటీ చేసి ఓడిపోయి, తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.


కానీ చిన్నమ్మ మాత్రం బీజేపీలో రాజకీయం చేస్తున్నారు. కాకపోతే చిన్నమ్మకు బీజేపీలో భవిష్యత్ కనిపించడం లేదు. ఎందుకంటే ఏపీలో బీజేపీ పుంజుకునే పరిస్తితి లేదు. జనసేనతో పొత్తు ఉన్న సరే బీజేపీకి ఏపీలో పెద్దగా ఓట్లు పడవు. కాబట్టి చిన్నమ్మ బీజేపీలో పోటీ చేస్తే గెలవడం కష్టం. మరి భవిష్యత్‌లో చిన్నమ్మకు రాజ్యసభ లాంటిది వస్తే రావాలి తప్ప, డైరక్ట్‌గా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అయితే జరిగే పని కాదని అర్ధమవుతుంది. మొత్తానికైతే బీజేపీతో చిన్నమ్మ సెట్ అవ్వడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: