ముంబై: ఇటీవల శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే. దీనిపై థాక్రే చేసిన వ్యాఖ్యలతో అనేక వదంతులు రేకెత్తాయి. శివసేన మళ్ళీ బీజేపీతో చేతులు కలపనుందని, వీరిద్దరు మళ్లీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దం అవుతున్నారంటూ అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఎన్‌సీఏ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందిస్తూ శివసేన మాట తప్పదని, ఈ ఐదేళ్ల తరువా కూడా మేము కలిసే ఉంటామని అన్నారు. అయితే తాజాగా వీటిపై మహరాష్ట్ర శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.


ఉత్తర మహారాష్ట్రలోని శివసేన కార్యకర్తలను ఉద్దేశించి సంజయ్ రౌత్ మాట్లాడారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేనను ఆశ్రయించిందని, కానీ బీజేపీ నాయకులు ఆ సమయంలో చాలా దారుణంగా ప్రవర్తించారని, శివసేన నాయకులను బీజేపీ బానిసలుగా చూశారని, దాంతో పాటుగా శివసేనను తమ అధికారంతో నామరూపాలు లేకుండా మహారాష్ట్రలో కనుమరు చేయాలని బీజేపీ ప్రయత్నించిందని సంజయ్ అన్నారు. శివసేన అందించిన అధికారాన్ని అనుభవిస్తూ తమనే నాశనం చేయాలని చూసిందని సంజయ్ అన్నారు.



అయితే 2019లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంపై ఈ రెండు పార్టీల మధ్య విభేధాలు రావడంతో శివసేన, బీజేపీ విడిపోయాయి. ఆ తరువాత శివసేన, ఎన్‌సీఏతో కలిసి ఎమ్‌వీఏ (మహా వికాస్ అఘాది) కూటమిని సిద్దం చేసి దాని ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని సంజయ్ తెలిపారు. అంతేకాకుండా 2019 ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం అజిత్ పవార్ అనేక పన్నాగాలు పన్నారని, ఇందులో భాగంగా బీజేపీతో కూడా చేతులు కలిపేందుకు సిద్దమయ్యారని, అటువంటి అజిత్ పవార్ ఇప్పుడు శివ సేన నాయకుడు ఉద్దవ్ థాక్రేతో కలిసి పనిచేస్తున్నారంటూ సంజయ్ పేర్కొన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని దానిని శివసేన నిజం చేసిందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp