రాజ‌స్తాన్ కాంగ్రెస్ పార్టీలో మ‌రో తుఫాన్ రేగింది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌, ఉప ముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ వ‌ర్గాలుగా రాష్ట్రంలో పార్టీ విడిపోయివుంది. పైల‌ట్ పార్టీ వీడ‌తారంటూ కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న వాట‌న్నింటినీ ఖండిస్తూ వ‌స్తున్నారు. తాజాగా త‌మ ఫోన్లు టాప్ అవుతున్నాయంటూ పైల‌ట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఎప్ప‌టినుంచో ఈ వ్య‌వ‌హారం న‌డుస్తోందంటూ ఎమ్మెల్యే వీపీ సోలంకి ఆరోపించారు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువెళితే న‌వ్వి ఊరుకున్నారంటూ మండిప‌డ్డారు.

మ‌మ్మ‌ల్ని ఇరికించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారా?
త‌మ ఫోన్లు ట్యాప్ చేస్తూ ప‌లువిధాలుగా మ‌మ్మ‌ల్ని ఇరికించ‌డానికి కొంత‌మంది ప్ర‌య‌త్నిస్తున్నారంటూ పైల‌ట్ వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే సోలంకి వ్యాఖ్యానించారు. చాలామంది ఎమ్మెల్యేలు ఈ విష‌యాన్ని త‌న‌కు తెలియ‌జేశార‌ని.. నా ఫోన్ ట్యాప్ చేశారో?  లేదో?  తెలియ‌దుకానీ కొంద‌రు ఎమ్మెల్యే  ఫోన్లు మాత్రం ట్యాప‌వుతున్నాయంటూ చెబుతున్నారు.. అధికారులు కూడా అదే మాటంటున్నారు.. వారు ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి గెహ్లాత్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు.. అస‌లు త‌మ ఫోన్లు ట్యాప‌వుతున్నాయా?  లేదా?  తెలుసుకునేందుకు ఓ యాప్ స‌హాయం తీసుకుంటున్నార‌ని సోలంకి తెలిపారు.
 
ట్యాప‌వుతున్నాయ‌నేదానికి ఆధారాల్లేవు!
కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప‌వుతున్నాయంటూ వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో ఆ పార్టీ చీఫ్ విప్ మ‌హేష్‌జోషి వాటిని ఖండించారు. ఆరోప‌ణ‌ల‌న్నీ నిరాధార‌మ‌న్నారు. ఎమ్మెల్యేగా బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న‌వారు ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసేట‌ప్పుడు ఒక‌సారి అన్నీ ప‌రిశీలించుకొని మాట్లాడాలంటూ హిత‌వు ప‌లికారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాజ‌స్తాన్ బీజేపీ నేత‌, కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి, గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. ఎమ్మెల్యేల ఆరోప‌ణ‌ల‌పై ముఖ్య‌మంత్రి స్పందించాల‌ని, కొద్దికాలంగా ఇవే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని, చ‌ట్ట‌విరుద్ధ‌మైన ప‌నులు చేస్తూ వాటిని రాజ‌కీయానికి ఉప‌యోగించుకుంటున్నారంటూ మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం స్పందించాల‌ని, దీనిపై ప్ర‌క‌ట‌న చేయాల‌ని డిమాండ్ చేశారు. ముఖ్య‌మంత్రి అశోక్‌గెహ్లాట్‌, ఉప ముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ వ‌ర్గాలుగా రాజ‌స్తాన్ కాంగ్రెస్ చీలిపోయి ఉంది. ఈ త‌రుణంలో మ‌ళ్లీ పైల‌ట్ వ‌ర్గీయుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు రావ‌డంతో గెహ్లాట్ స‌మాధానం చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ఆయ‌న ఇంత‌వ‌ర‌కు దీనిపై ఏమీ స్పందించ‌లేదు. ఈ ప‌రిణామం ఎటుదారితీస్తుందోనంటూ కాంగ్రెస్ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: