న్యూఢిల్లీ: దేశమంతా కరోనా మహమ్మారి అల్లకల్లోలం చేస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కరోనా కట్టడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కఠిన చర్యలతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వాలు అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించాలని ప్రణాళిక సిద్దం చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి లాక్‌డౌన్ సడలింపులను ప్రకటించారు. ఈ నెల 14నుంచి అంటే రేపటి నుంచే రాష్ట్రంలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు.
 

అన్‌లాక్‌లో భాగంగా రేపటి నుంచి రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు. కానీ వాటిని కేవలం 50శాతం సామర్థ్యంతోనే నడపాలని కేజ్రీవాల్ తెలిపారు. అదే విధంగా మున్సిపల్ జోన్స్‌లో వారాంతపు మార్కెట్‌లకు కూడా అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. వీటితో పాటుగా పాఠశాలలు, కాలేజ్‌లు, విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు, సినిమా హాళ్లు,  స్విమ్మింగ్‌పూల్స్‌, వ్యాయామశాలలు, పార్కులన్నీ కూడా ప్రభుత్వ ఉత్తర్వుల వచ్చేవరకు మూత వేసే ఉంచాలని తెలిపారు. కానీ నగరంలోని ఆధ్యాత్మిక కేంద్రాలను తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే సందర్శకులకు మాత్రం రాష్ట్రంలో అనుమతి లేదని తెలిపారు. వాటితో పాటుగా మార్కెట్లు, మాల్స్‌ సరి, బేసి విధానంలో మాత్రమే తెరిచి ఉంచాలని పేర్కొన్నారు.



ఈ అన్‌లాక్‌లో భాగంగా మరిన్నింటికి కూడా మినహాయింపులు ఇచ్చారు. వాటిలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్-ఏ అధికారులు 100 శాతం హాజరుకావాలని తెలిపారు. ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సామర్థ్యంతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పనిచేసేందుకు అనుమతులు ఇచ్చారు. వీటితో పాటు శుభకార్యాలు, అంత్యక్రియలకు కేవలం 20 మందికి మించి ఉండరాదని తెలిపారు.వీటితో పాటు ఢిల్లీ మెట్రో, బస్సులు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. ఇక ఆటోలు, ఇ-రిక్షాలు, ట్యాక్సీలు వంటివి ఇద్దరుకు మించి ప్రయాణికులు ఉండకూడదని తెలిపారు. అదేవిధంగా మ్యాక్సీ క్యాబ్‌లలో 5గురు, ఆర్‌టీవీలో 11 మంది ప్రయాణించవచ్చు. అంతరాష్ట్రాల మధ్య ప్రయాణికులు, సరకు రవాణాలకు ఎలాంటి నిబంధనలు లేవు. ప్రత్యేక అనుమతులు, ఇ-పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: