శ్రీ‌మ‌ద్విరాట్ పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామివారి గురించి తెలియ‌నివారుండ‌రు. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే సంఘ‌ట‌ల‌న్నీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చెప్పారు. తాజాగా మ‌నం ఎదుర్కొంటోన్న కొవిడ్ గురించి కూడా చెప్పారు. ఈశాన్యాన‌ కోరంకి అనే వ్యాధి పుడుతుంద‌ని, సాధార‌ణ మందుల‌కు త‌గ్గ‌ద‌ని, వ‌న‌మూలిక‌లతోనే త‌గ్గుతుంద‌ని కూడా చెప్పారు. అంత‌టి గొప్ప స్వామివారు త‌న మ‌ఠం గురించి మాత్రం చెప్ప‌డం మ‌రిచిపోయివుండాలి. లేదంటే ఎందుకులే అనుకొని ఉండాలి. ప్ర‌జ‌ల‌కు సేవ‌చేయాల‌నే ఉద్దేశంతో ఆయ‌న మ‌ఠం నెల‌కొల్పారు. అటువంటి మ‌ఠం కూడా ఇప్పుడు దుష్ట రాజ‌కీయాల‌కు వేదిక‌వ‌డం దుర‌దృష్ట‌క‌రం.

స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేని పీఠాధిప‌తులు
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామివారు ఆరోగ్యం బాగుండ‌క‌పోవ‌డంతో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు భార్యలు. వారిద్ద‌రికీ కుమారులున్నారు. చిన్న భార్య కుమారుడికి త‌న మ‌ర‌ణానంత‌రం మ‌ఠాధిప‌తి ప‌ద‌వి ద‌క్కాలంటూ వేంక‌టేశ్వ‌రస్వామివారు వీలునామా రాశారు. అయితే త‌న కుమారుడికే పీఠాధిప‌తి ప‌ద‌వి ద‌క్కాలంటూ పెద్ద భార్య ప‌ట్టుబ‌ట్ట‌డంతో వివాదం పెద్ద‌దైంది. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు శైవక్షేత్ర పీఠాధిపతులు 12 మంది ఇటీవ‌లే బ్రహ్మంగారి మఠంలో స‌యోధ్య చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా అవ‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి.

మ‌ఠం ప‌విత్ర‌త‌ను కాపాడాలంటూ డీజీపీకి లేఖ‌
స్వామివారి రెండో భార్య మారుతి మహాలక్ష్మి త‌న ప్రాణానికి హాని ఉందంటూ డీజీపీకి లేఖ రాశారు. మొదటి భార్య కుమారుడు వెంకటాద్రిస్వామి చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు సాగించేవారితో చేతులు క‌లిపి త‌మ‌పై త‌రుచుగా దాడిచేస్తున్నాడంటూ ఆ లేఖ‌లో పేర్కొన్నారు. అలాగే కొంద‌రు పీఠాధిప‌తులు కూడా వెంక‌టాద్రిస్వామికి మ‌ద్ద‌తుగా కుట్ర‌ప‌న్నుతున్నార‌ని ఆరోపించారు. ఈ వివాదాన్ని పరిష్కరించి ప‌విత్ర‌మైన మ‌ఠాన్ని కాపాడాల‌ని కోరారు. అయితే మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ జోక్యంతోనే సామ‌ర‌స్యంగా ప‌రిష్కార‌మ‌వ్వాల్సిన స‌మ‌స్య పీఠ‌ముడిగా మారింద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. రెండు కుటుంబాల మ‌ధ్య వివాదం పెద్ద‌ద‌య్యేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ అక్క‌డి ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. మఠం నిర్వహణకు కడప అసిస్టెంట్ కమిషనర్‌ను నియ‌మించ‌డం, మఠాధిపతిపై ధార్మిక పరిషత్‌ నిర్ణయం తీసుకుంటుందంటూ ప్ర‌క‌టించ‌డం, నెల‌రోజుల మందుగా నోటీసులిచ్చి  అందరితో చర్చిస్తామన‌డ‌మే ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వ పెద్ద‌లు జోక్యం చేసుకొని వివాదం పెద్ద‌ది కాకుండా చూడాల‌ని, అర్హులైన‌వారికి న్యాయం చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: