ఏపీలో జగన్ పాలన రెండేళ్ళు పూర్తి అయింది. ఒక విధంగా చెప్పాలంటే సగం పాలన అయినట్లే. అంటే వైసీపీ పొలిటికల్ మూవీకి ఇంటర్వెల్ సీన్ వచ్చేసింది అన్న మాట. మరి ఈపాటికి అయితే కొంతమంది జనాల్లో అయినా వ్యతిరేకత రావాలి. ఎందుకంటే ఎంతటి జనాదరణ ఉన్న వారికైనా కూడా యాంటీ ఇంకెంబెన్సీ అన్నది తప్పదు.

మరి ఏపీలో జగన్ సంగతి ఏంటి అన్న చర్చ అయితే ఉంది. ఏపీలో జగన్ వరస పెట్టి విజయాలు సాధిస్తున్నారు. ఆయన పార్టీ రెండేళ్ళ క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లు సాధించింది. బంపర్ విక్టరీని చరిత్రలో నమోదు చేసింది. ఇక ఈ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ మంచి విజయాలను దక్కించుకుంది. దాంతో ఏపీలో వైసీపీకి తిరుగులేదు అన్న పరిస్థితి ఉంది. అయితే ఎప్పటికపుడు పరిణామాలు మారిపోతూంటాయి కాబట్టి ఏపీలో జగన్ కి ఉన్న నిజమైన బలం ఎంత. ఏఏ వర్గాలు ఆయన పార్టీని మెచ్చుకుంటున్నారు అన్న దాని మీద అనేక రకాల సర్వేలు జరుగుతున్నాయి.

ఇక రాజకీయ పార్టీలు అయితే తమ పరిస్థితితో పాటు ఎదుటి పార్టీ పరిస్థితి ఎలా ఉంది అన్న దాని మీద సర్వేలు తరచూ  చేయిస్తూ ఉంటాయి. అయితే పలు రకాలైన సర్వేలలో మాత్రం జగన్ కి బలం గట్టిగానే ఉంది అన్న ఆన్సర్ వస్తోందిట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ గట్టి పట్టు సంపాదించింది అంటున్నారు. అదే విధంగా గతానికి భిన్నంగా పట్టణ ప్రాంతాలలోని దిగువ మధ్యతరగతి, పేద వర్గాలలో కూడా జగన్ పార్టీకి కొత్తగా ఆదరణ దక్కుతోంది అంటున్నారు.

దీని మీద కేంద్రంలో అధికారలో ఉన్న పార్టీతో పాటు విపక్ష పార్టీలు కూడా జగన్ పార్టీ గురించి ఆరా తీస్తున్నాయట. ఎందుకంటే ఇపుడు దేశంలో రెండు సార్లు మోడీ అధికారంలోకి వచ్చారు. మూడవసారి ఆయన మళ్ళీ గెలవాలని అనుకుంటున్నారు. ఇంకో వైపు కాంగ్రెస్ కూడా పుంజుకుని  ప్రాంతీయ పార్టీల మద్దతుతో రేపటి రోజున కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటోందిట. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలుగు రాష్ట్రాల మీదనే దృష్టి పెట్టారని అంటున్నారు. దాంతో ఇపుడు సర్వేలు జరుగుతున్నాట. ఏది ఏమైనా ఏపీలో రెండేళ్ళుగా చూసుకుంటే విపక్షాలు పెద్దగా పుంజుకోలేదు అన్నది సర్వేల మాట కాదు, ఈ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక చెప్పిన మాటే. రానున్న రోజులలో ఏపీలో మరి కొన్ని ఉప ఎన్నికలు జరగనున్నాయని అంటున్నారు. దాంతో అపుడు కూడా ప్రజల నాడి ఏంటో తెలుసుకోవచ్చు. మొత్తానికి పధకాలే జగన్ కి శ్రీరామ రక్షగా ఉన్నాయని అంటున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: