ఎంపీ రఘురామకృష్ణంరాజు...ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అయిన నాయకుడు. ఢిల్లీలో ఉంటూ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న నేత. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచి, జగన్‌పైన తీవ్ర విమర్శలు చేస్తున్న రాజుగారి రాజకీయం రోజురోజుకూ మారుతుంది. అయితే తమ పార్టీ నుంచే గెలిచి తమకు తలనొప్పిగా మారిన రఘురామకు చెక్ పెట్టాలని జగన్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తుంది.


కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇప్పటికే రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అది రివర్స్ అయింది. బెయిల్ మీద బయటకొచ్చిన రాజుగారు ఢిల్లీ స్థాయిలో జగన్ ప్రభుత్వం పరువు తీసే పనిలో ఉన్నారు. ఇలా రఘురామ పెద్ద తలనొప్పిగా మారిన కూడా వైసీపీ అధిష్టానం ఏం చేయలేకపోతుంది. అయితే రఘురామ ఎంపీ పదవిపై వేటు వేయాలని పలుమార్లు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.


తాజాగా కూడా ఎంపీ మార్గాని భరత్, రఘురామపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ని కోరారు. అలాగే వైసీపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపీల లిస్ట్‌లో రఘురామని తొలగించారు. ఇక దీనిపై కూడా రఘురామ రివర్స్ అయ్యారు. తనని పార్టీ నుంచి బహిష్కరిస్తే అధికారికంగా చెప్పాలని లేదంటే, తనని ఇండిపెండెంట్‌గా గుర్తించాలని స్పీకర్‌ని కోరతానని చెప్పేశారు.


అయితే స్పీకర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసిన రఘురామపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ ఫిర్యాదులకు సంబంధించి రఘురామని వివరణ కూడా అడగలేదు. దీని బట్టి చూస్తే రఘురామపై వేటు పడటం కష్టమే అని తెలుస్తోంది. పైగా రఘురామకు బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వైసీపీ అనుకున్నట్లుగా రఘురామపై స్పీకర్ వేటు వేయడం కూడా అయ్యే పని కాదని అర్ధమవుతుంది. కాబట్టి ఈ రఘురామ ఎపిసోడ్ నెక్స్ట్ ఎన్నికల వరకు కొనసాగుతుందనే చెప్పొచ్చు. వైసీపీ ప్రభుత్వానికి రఘురామ తలనొప్పి కంటిన్యూ అయ్యేలాగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: