విశాఖపట్నంలో టీడీపీ నేతల భూ కబ్జాల బాగోతాలు అంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. గత చంద్రబాబు ప్రభుత్వంలో విశాఖ టీడీపీ నేతలు అనేక ప్రభుత్వ భూములని ఆక్రమించుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌తో సహ ఇతర వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అలాగే వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియా సైతం టీడీపీ నేతలని టార్గెట్ చేసి వరుసపెట్టి కథనాలు వేస్తుంది.


ముఖ్యంగా టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు టార్గెట్‌గా రాజకీయం నడుస్తోంది. గతంలో ఆయన వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములని కబ్జా చేశారని, పలుచోట్ల అక్రమ కట్టడాలు నిర్మించారని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఇటీవల ఆయనకు చెందిన పలు అక్రమ కట్టడాలని కూల్చేస్తున్నారు. భూ కబ్జాలకు సంబంధించి స్థానిక అధికారులతో విచారణ చేయిస్తున్నారు. అయితే ఇంతవరకు అంతా బాగానే ఉంది. అక్రమాలకు పాల్పడితే అలాంటి భూములని స్వాధీనం చేసుకుని, పల్లాపై కేసులు పెట్టాలి.


కాకపోతే ఈ అక్రమాల విషయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ లాజిక్ మిస్ అయిపోతున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కబ్జాలు జరిగాయంటున్న అవంతి....గత ఐదేళ్లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. 2014లో టీడీపీలోకి వచ్చి అనకాపల్లి ఎంపీగా గెలిచిన అవంతి, ఆ ఐదేళ్ల పాటు టీడీపీలోనే ఉన్నారని, అప్పుడే భూకబ్జాలకు పాల్పడుతుంటే తప్పు అని అవంతి చెబితే బాగుండేది అని అంటున్నారు.


అలా కాకుండా వైసీపీలోకి వచ్చి మంత్రి అయ్యాక మాట్లాడితే దానికి లాజిక్ ఉండదని చెబుతున్నారు. అలాగే విశాఖని రాజధానిగా చేస్తున్నామని ప్రకటించాక వైసీపీ నాయకులు పెద్ద స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని, అటు విజయసాయిరెడ్డి, ఆయన బంధువులు విశాఖలో చేసే అక్రమాలు అందరికీ తెలుసని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక విశాఖలో గత రెండేళ్లుగా జరిగిన అక్రమాలపై విచారణ చేస్తే వైసీపీ నేతలంతా జైలుకు వెళ్ళడం ఖాయమని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: