ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయాక చాలామంది నాయకులు వైసీపీలోకి జంప్ చేసిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ళు టీడీపీలో కీలకంగా పనిచేసిన నాయకులు సైతం ఒక్కసారి చంద్రబాబుకు షాక్ ఇచ్చి, వైసీపీలో చేరారు. అలా సీనియర్ నేత బీదా మస్తాన్ రావు సైతం వైసీపీలోకి వెళ్ళిపోయారు. బీదా నెల్లూరు టీడీపీలో కీలకంగా ఉండేవారు. 2009లో కావలి ఎమ్మెల్యేగా గెలిచిన బీదా, 2014లో ఓటమి పాలయ్యారు.


అయితే 2019 ఎన్నికల్లో సైతం బీదా కావలిలోనే పోటీ చేయాల్సి ఉంది. కానీ చంద్రబాబు అనూహ్యంగా బీదాని నెల్లూరు ఎంపీగా నిలబెట్టారు. జగన్ వేవ్‌లో బీదా ఘోరంగా ఓడిపోయారు. అయితే ఓడిపోయాక బీదా చాలారోజులు సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే గతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఉన్న పరిచయాలు, అలాగే తన వ్యాపారాల దృష్ట్యా బీదా వైసీపీలో చేరిపోయారు.


ఇక వైసీపీలో చేరేటప్పుడు బీదాకు రాజ్యసభ హామీ ఇచ్చినట్లు వార్తలు సైతం వచ్చాయి. అలాగే గతేడాది రాజ్యసభ పదవులు భర్తీ చేసేప్పుడు, బీదాకు ఖచ్చితంగా పదవి ఖాయమని ప్రచారం జరిగింది. కానీ మండలి రద్దు నేపథ్యంలో ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేసిన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలకు జగన్ రాజ్యసభ ఇచ్చారు. అలాగే అంబానీ రికమండేషన్‌తో పరిమళ్ నత్వానీకి రాజ్యసభ దక్కింది. జగన్‌తో సన్నిహితంగా ఉండే అయోధ్యరామిరెడ్డికి రాజ్యసభ వచ్చింది.


దీంతో బీదాకు రాజ్యసభ దక్కలేదు. అయితే వైసీపీలో చేరిన దగ్గర నుంచి బీదా పెద్ద యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. మొదటలో తన సొంత నియోజకవర్గం కావలిలో టీడీపీ నేతలని వైసీపీలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ బీదా పార్టీలో కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ పదవుల పంపకాలు జరుగుతున్నాయి. గవర్నర్ కోటాలో నలుగురికి ఎమ్మెల్సీలు దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. 


అలాగే ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీలు భర్తీ చేయాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆ ఎన్నిక వాయిదా పడింది. అటు స్థానిక సంస్థల కోటాలో 8 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటి భర్తీ కూడా వాయిదా పడనున్నాయి. అయితే ఇవన్నీ వైసీపీకే దక్కనున్నాయి. అందుకే వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. మరి బీదాకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంటుందేమో చూడాలి. లేదంటే ఆయన రాజ్యసభ కోసం ఎదురుచూస్తారేమో?

మరింత సమాచారం తెలుసుకోండి: