రాజకీయాల్లో సొంత పార్టీని కాపాడుకోవడం చాలా అవసరం.. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీలోని నాయకులకు చాలా ఆశలుంటాయి. అధికారం మనదే కదా.. ఏదో ఒక రూపంలో ఆ అధికారంలో పాలుపంచుకోవాలని నాయకులు ఆశపడుతుంటారు. అయితే అందరికీ అన్ని పదవులు అందవు కదా. ఆ విషయం వారికీ తెలుసు. అందుకే తమ స్థాయికి తగ్గట్టు ఎవరికి వారు ఓ పదవి అందుకోవాలని ఆశపడుతుంటారు. అయితే పార్టీలోని ప్రముఖులకే మంత్రి పదవులు, ఎంపీ, ఎమ్మెల్యే వంటి అవకాశాలు తక్కువ మందికే వస్తుంటాయి.

ఇక ద్వితీయ శ్రేణి నాయకులంతా నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉంటేనే.. కింది స్థాయి నాయకులు కాస్త ఉత్సాహంగా పని చేస్తారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ అదే పనిలో ఉన్నారు. పార్టీలో మరోసారి పదవుల పంపకానికి సిద్ధమవుతున్నారు. ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలో 80 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేయబోతున్నారు. అంతే కాదు.. 960 డైరెక్టర్ డైరెక్టర్ పదవుల భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే బాధ్యులను నియమించిన జగన్.. ఇప్పుడు వారితో మథనం జరపబోతున్నారు.

ఐదుగురు ప్రాంతీయ బాధ్యులతో నేటి నుంచి సీఎం జగన్ ఈ పదవుల పంపకంపై చర్చించబోతున్నారు. ఇప్పటికే ఈ పదవులకు అర్హులైన అవకాశం ఉన్న  నాయకుల జాబితా జిల్లాల వారీగా తయారైంది. ఆ అర్హుల జాబితాలు పరిశీలించనున్న జగన్... ఫైనల్ జాబితాను ఖరారు చేస్తారు. ఇలా జాబితా పూర్తిగా ఖరారయ్యాక ప్రకటన ఉంటుంది. నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

పార్టీ సదరు నాయకులు చేసిన సేవ.. గతంలో ఇచ్చిన హామీలు, స్థానిక రాజకీయ సమీకరణాలు.. ఇలాంటి విషయాలు పదవులకు అర్హులను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనేక పదవుల పంపకాల్లో జగన్ ఈ ఫార్ములా అనుసరించారు. ఈసారి కూడా అదే తరహాలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: