హైదరాబాద్‌ విదేశీ అక్రమ శక్తులకు అడ్డాగా మారుతోందా..? హైదరాబాద్‌లో విదేశాలకు చెందిన వారు సులభంగా మకాం వేస్తున్నారా.. చట్టవిరుద్ధ, దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆ మధ్య జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో పాతబస్తీ రోహింగ్యాల అడ్డాగా మారిందని బీజేపీ నేత బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం ఇస్తే.. పాత బస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని సంచలన ప్రకటన చేశారు కూడా. ఇప్పుడు మరోసారి ఆ విషయం గుర్తుస్తోంది. ఎందుకంటే.. ఇటీవల భారత్‌-బంగ్లా సరిహద్దుల్లో దొరికిపోయిన చైనా గూఢచారి హాన్‌ జున్వే హైదరాబాద్‌ నగరంలో కొన్నాళ్లు ఉన్నాడని తెలుస్తోంది.

ఈ చైనా గూఢచారి జున్వే 2010లో హైదరాబాద్‌లో కొద్దిరోజులు ఉన్నట్టు వెల్లడించాడు. అయితే తాను ఎక్కడ ఉన్నది మాత్రం చెప్పలేదు. అంతే కాదు.. హైదరాబాద్‌లో ఎవరిని కలిశాడు. ఏం చేశాడనే వివరాలు చెప్పలేదు. దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన అంశం కావడంతో భద్రతా దళాలు చైనా గూఢచారి గురించిన సమాచారాన్ని ఇక్కడి పోలీసులకు తెలిపాయి. ఇప్పుడు ఈ చైనా గూఢచారి అంశం హైదరాబాద్‌ పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. 2010లో అంటే దాదాపు పదకొండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చిన జున్వేకు ఎవరు సహకరించారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఈ చైనా గూఢచారి నకిలీ పత్రాలు కూడా సృష్టించుకున్నాడని తెలుస్తోంది. కమీషన్ల కక్కుర్తితో కొందరు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇలాంటి పత్రాల సృష్టికి సహకరిస్తున్నారు. ఇలా కొన్ని పత్రాలు సృష్టించుకున్న ఈ చైనా గూఢచారి జున్వే వందలాది సిమ్‌ కార్డులు కొనుగోలు చేసాడట. వాటిని తమ దేశానికి తరలించాడట. దాదాపు 1,300కు పైగా సేకరించిన సిమ్‌కార్డుల్లో అధిక శాతం హైదరాబాద్‌లో కొనుగోలు చేసినవేనట. ఇలా చైనా వేగు జున్వేకు సిమ్‌కార్డుల కోసం దళారులు సహకరించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ చైనా వేగు జున్వే 11 ఏళ్ల క్రితం వచ్చినపుడు ఎక్కడ ఉన్నాడు.. ఏ హోటల్‌లో దిగాడు.. ఒక్కడే వచ్చాడా.. ఇంకొందరు చైనా దేశస్థులు కూడా వచ్చారు.. ఇతనికి ఎవరునా సహకరించారు.. అనే అంశాలపై ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు కూపీ లాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: