తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు భార‌తీయ జ‌న‌తాపార్టీకి ఆఫ‌ర్ ఇచ్చారా? అది కూడా ఆ పార్టీకి తెలంగాణ‌లో చివ‌రి అవ‌కాశ‌మా? అంటే ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. కేసీఆర్ అనుకుంటేనేకానీ భ‌విష్య‌త్తులో రాష్ట్రంలో ఎటువంటి ఉప ఎన్నిక‌ల‌కు అవ‌కాశం లేదు. ఈటెల ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక్క‌టే చివ‌రిది. దుబ్బాక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌తో రేసులోకి వ‌చ్చిన బీజేపీ ఆ త‌ర్వాత నాగార్జున‌సాగ‌ర్‌తోపాటు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, మినీ పుర‌పోరులో ప‌రాజ‌యం పాలైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుస్తుందా? ఈటెల గెలుస్తారా? అధికార పార్టీ విజ‌యం సాధిస్తుందా? అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా అయితే అంద‌రి మ‌ద్ద‌తు ల‌భించేది!
ఈటెల రాజేంద‌ర్ హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌గా ఉన్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తాపార్టీకి ఇక్క‌డ కేవ‌లం 1600 ఓట్ల మాత్ర‌మే వ‌చ్చాయి. ఈటెల బీజేపీలో చేర‌కుండా స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీచేస్తే అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించేంద‌ని, పార్టీ నుంచి కేసీఆర్ కావాల‌నే బ‌య‌ట‌కు పంపించార‌నే సానుభూతి కూడా ప‌నిచేసేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీలో చేర‌డంద్వారా ఈటెల‌కు ఆ అవ‌కాశం లేకుండా పోయింద‌ని, కొన్నివ‌ర్గాల మ‌ద్ద‌తు మాత్ర‌మే ల‌భించే అవ‌కాశం ఉంంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌ర‌కంగా ఉప ఎన్నిక‌లో గెల‌వ‌డ‌మ‌నేది బీజేపీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారుతుంది. రాజేంద‌ర్ ఓట‌మిపాలైతే ఆయ‌న‌కు జ‌రిగే న‌ష్టంక‌న్నా క‌మ‌లం పార్టీకి జ‌రిగే న‌ష్ట‌మే ఎక్కువ‌. రాజేంద‌ర్ ప‌రాజితుడిగా నిలిచాడు అనేదానిక‌న్నా బీజేపీ ఓడిపోయింది అంటూ జ‌రిగే ప్ర‌చార‌మే ఎక్కువ‌గా ఉండ‌బోతోంది.

రాజ‌కీయ వ్యూహంలో కేసీఆర్ గండ‌ర గండ‌డు!
రాజ‌కీయ వ్యూహాల‌ను పన్న‌డంలో గండ‌ర గండ‌డుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ అధికార పార్టీకి ఉండే అన్ని అవ‌కాశాలను ఉప‌యోగించుకుంటారు. అలా చేయ‌డంలో ఆయ‌న ఎంతో సిద్ధ‌హ‌స్తుడు. అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు ఎటువంటి ఉప ఎన్నిక‌లు లేవుకాబ‌ట్టి ఒక‌ర‌కంగా కేసీఆర్ భార‌తీయ జ‌న‌తాపార్టీకి ఒక ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లుగా భావించ‌వ‌చ్చ‌ని సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌లు అంటున్నారు. ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకొని దుబ్బాక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో గెలుపు గాలివాటంగా వ‌చ్చింది కాద‌ని  నిరూపించుకోవాల్సిన బాధ్య‌త కూడా ఆ పార్టీపై ఉంది. ఈటెల రాజేంద‌ర్ చాలా తెలివిగా త‌న బాధ్య‌త‌ల‌ను బీజేపీ భుజ‌స్కంధాల‌పై పెట్టారు. మ‌రి బీజేపీ రాజేంద‌ర్‌ను మోస్తుందా?  రాజేంద‌ర్ బీజేపీని మోస్తాడా? అనే విష‌యంలో స్ప‌ష్ట‌త రావాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.!


మరింత సమాచారం తెలుసుకోండి: