గత కొన్నిరోజులుగా విశాఖపట్నంలో టీడీపీ నాయకుడు పల్లా శ్రీనివాస్ టార్గెట్‌గా వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. విశాఖ టీడీపీలో కీలకంగా మారిన పల్లాపై అనేక భూ కబ్జాల ఆరోపణలు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో పల్లా అనేక ప్రభుత్వ భూములని కబ్జా చేశారని, పలుచోట్ల అక్రమ కట్టడాలని కట్టారని అంటున్నారు. ఇప్పటికే పల్లాకు చెందిన పలు అక్రమ కట్టడాలని కూల్చివేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.


అలాగే వందలకోట్ల విలువ చేసే భూములని పల్లా కబ్జా చేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. అయితే తాను వైసీపీలో చేరట్లదనే తనపై కక్ష సాధిస్తున్నారని పల్లా చెబుతున్నారు. ఎక్కడో ఉన్న భూములు తనవే అని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇక పల్లాకు మొన్నటివరకు ఇతర టీడీపీ నేతల మద్ధతు రాలేదు. కానీ తాజాగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పల్లాకు సపోర్ట్‌గా నిలిచారు.   


ఒకవేళ పల్లా గానీ భూములు కబ్జా చేశారని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెలగపూడి, అవంతికి సవాల్ విసిరారు. లేదంటే మంత్రి అవంతి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే పల్లాకు వెలగపూడి సపోర్ట్ చేయడానికి కారణం లేకపోలేదు. ఇటీవల వెలగపూడి టార్గెట్‌గా వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు.


వంగవీటి రంగా హత్యకేసులో ముద్దాయి వెలగపూడి అని గతంలో విజయసాయిరెడ్డి ఆరోపించారు. విజయవాడ నుంచి విశాఖకు వెలగపూడి పారిపోయి వచ్చారని, అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వెలగపూడి భూ కబ్జాలకు పాల్పడ్డారని అన్నారు. ఇలా వైసీపీ నేతలు విశాఖ టీడీపీ నేతల టార్గెట్‌గా రాజకీయాన్ని వేడెక్కించారు. విశాఖలో టీడీపీని దెబ్బతీయడానికే వైసీపీ నేతలు ఇలాంటి ఆరోపణలకు దిగారని తెలుస్తోంది. ఒకవేళ టీడీపీ నేతలు వైసీపీలో చేరితే అప్పుడు భూ కబ్జా ఆరోపణలు ఏం అవుతాయో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: