సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో 215వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ....ఆంధ్ర‌ప్రేదేశ్ లో మహా నగరాలు లేవని వ్యాఖ్యానించారు. దాంతో బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాలకు అత్యుత్తమ వైద్యం కోసం వెళ్లాల్సిన పరిస్థితి వ‌స్తోంద‌న్నారు. అందువ‌ళ్లే విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ ఆస్పత్రులను అభివృద్ధి చేపట్టామ‌ని తెలిపారు. అంతే కాకుండా 16 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకు వస్తున్నామ‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. నాణ్యమైన ధృవీకరించిన విత్తనాల దగ్గరనుంచి, పండించిన పంటను అమ్మేంతవరకూ రైతుకు చేదోడు, వాదోడుగా ఆర్బీకేలు నిలుస్తాయని జ‌గ‌న్ తెలిపారు. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని అన్నారు. 

గోడోన్లు, కోల్డ్‌ స్టోరేజీలు సహా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. పార్లమెంటు, నియోజకవర్గం స్థాయిలో సెకండరీ ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. మహిళా సాధికారితకోసం అనేక చర్యలు తీసుకున్నామ‌ని జ‌గ‌న్ తెలిపారు. చేయూత, ఆసరా ప‌థకాల లబ్ధిదారులైన మహిళలకు నాలుగేళ్లపాటు స్థిరంగా వారి చేతిలో డబ్బు పెడుతున్నామ‌ని వాఖ్యానించారు. అలాగే అమ్మ ఒడి కింద కూడా వారికి ఏడాదికి డబ్బు ఇస్తున్నామ‌ని చెప్పారు. ఈ మూడు పథకాలు మహిళా సాధికారితలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. 17వేలకు పైగా కొత్త కాలనీలను నిర్మిస్తున్నామ‌ని అన్నారు.

పేదలైన అర్హులైన లబ్ధిదారులను పారదర్శక పద్ధతిలో ఎంపిక చేశామ‌ని చెప్పారు. ఈ ఏడాది 15 లక్షలకు పైగా ఇళ్లను తొలివిడతలో నిర్మిస్తున్నామ‌ని అన్నారు. ఈ కాలనీలు మురికివాడలుగా మారకూడదని చెప్పారు.  అందుకనే మౌలికసదుపాయాలను కల్పిస్తున్నామ‌న్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, ఇతర సోషల్‌ ఇన్‌ఫ్రాను కూడా కల్పిస్తున్నామ‌ని అన్నారు. అంతే కాకుండా ఈ ప‌థ‌కం కోసం దాదాపుగా రూ. 34వేల కోట్లు ఖర్చు చేస్తామ‌ని తెలిపారు. ఈ అంశాల్లో బ్యాంకుల సహకారం కావాల‌న్నారు. ఎంఎస్‌ఎంఈల కోంసం రీస్టార్ట్, నవోదయ కార్యక్రమాలు చేపట్టామ‌ని చెప్పారు.

అలాగే కౌలు రైతులకు రుణాల సదుపాయం కూడా అందేలా దృష్టిపెట్టాలని బ్యాంకులను కోరుతున్నామ‌న్నారు. గ్రామాల స్థాయిలో ఆర్బీకేలు ఉన్నాయని అన్నారు. ఇక 2021–22 వార్షిక రుణ ప్రణాళికను ముఖ్య‌మంత్రి విడుద‌ల చేశారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.2,83,380 కోట్లు గా ఉంది. దీంట్లో భాగంగా 54శాతం రుణాలు వ్యవసాయ రంగానికి ఇవ్వ‌నున్నారు. వ్యవసాయరంగంలో రూ.1,48,500 కోట్లు ఇవ్వాలని ప్ర‌ణాళిక సిద్దం చేశారు. మొత్తంగా ప్రాథమిక రంగానికి రూ. 2,13,560 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వార్షిక రుణ ప్రణాళికలో ఇది 75.36శాతంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: