దేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త తరహాలో వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారు. ఈ వాలంటరీ వ్యవస్థ అద్భుతమని, ప్రభుత్వాన్నే పేదవాడి గడప వద్రకు తీసుకు వచ్చిందని ప్రజలు చంకలు గుద్దుకున్నారు. ఆ తరువాత గ్రామ సచివాలయాలు ఏర్పడటంతో ప్రతి పని కూడా అక్కడే పూర్తవుతుంది. ఇది ఒకందుకు మంచే చేసినా మరోపక్క మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖతో సహా మరికొన్ని శాఖల అధికారులను బద్దకస్తులుగా మారుస్తుందని కొందరు అంటున్నారు. ప్రతి పనిని గ్రామసచివాలయాలు పూర్తి చేయడంతో వీరికి పనిలేకుండా పోయింది. దాంతో తమకి పనితప్పిందిలే అన్న భావనతో ప్రభుత్వ అధికారులు తమ విధులను నిర్వర్తించడంలో మరింత అలసత్వం చూపిస్తున్నారు. ఈ క్రమంలో వారు చేయాల్సిన ఒకటి అర పనులను కూడా వాయిదా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే కరోనా కారణంగా మరణించిన వారి అంత్యక్రియలకు ప్రభుత్వం కేటాయించిన నగదు బాధితులకు అందడం లేదు. ఆ విషయం తమకు తెలియదని రెవిన్యూ శాఖ వారు అంటే, వైద్య శాఖ వారు కూడా అదే మాట అంటూ రోజులు గడుపుతున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకి అయినవారిని కోల్పోయిన వారికి మృతిచెందిన వారి అంత్యక్రియల నిమిత్తం రూ.15000 అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ పనులేవి ఇప్పటివరకు ముందుకు సాగలేదు. ఇదే తరహాలో మున్సి పాలిటీ అధికారులు కూడా తమ పనుల విషయంలో అలసత్వం కనబరుస్తున్నారు. దీంతో సచివాలయాలు వచ్చి మంచి చేశాయా, చెడు చేశాయా అనేది అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు.


ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పథకాలు, అదేశాలు జారీ చేస్తుంది. కానీ వాటిని ప్రజల చెంతకు తీసుకురావాల్సింది మాత్రం అధికారులే. ఇప్పుడు వారే బద్దకస్తులై నిర్లక్ష్య ధోరణితో తమ విధులను నిర్వర్తించడంలో విఫలమవుతున్నారు. అధికారుల బద్దకానికి అమాయకపు ప్రజలు ఎవరిని అడిగితే తమకు న్యాయం జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: