ఏపీలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చంద్రబాబు గట్టిగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీని పైకి తీసుకోచ్చేందుకు బాబు బాగానే ప్రయత్నిస్తున్నారు. జగన్ దెబ్బకు సైడ్ అయిపోయిన టీడీపీ నేతలని బయటకుతీసుకొచ్చి నియోజకవర్గాల్లో పార్టీని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టి, వైసీపీని నిలువరించడానికి వ్యూహాలు రచిస్తున్నారు.


అయితే పార్లమెంట్ అధ్యక్షులు అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదు. ఇప్పటికీ పలు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ వెనుకబడి ఉంది. ముఖ్యంగా విజయనగరం పార్లమెంట్ స్థానంలో టీడీపీ వెనుకబడి ఉంది. ఈ స్థానంలో టీడీపీని యువ నాయకుడు కిమిడి నాగార్జున నడిపిస్తున్నారు. మాజీ మంత్రి కిమిడి మృణాలిని వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన నాగార్జున గత ఎన్నికల్లో చీపురుపల్లిలో పోటీ చేసి బొత్స సత్యనారాయణ మీద ఓడిపోయారు.


ఘోరంగా ఓడిపోయిన సరే చీపురుపల్లిలో పార్టీని నిలబెట్టేందుకు కష్టపడుతున్నారు. అలాగే విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడుగా నాగార్జున, టీడీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. కానీ అనుకున్న మేర నాగార్జున విజయనగరంలో టీడీపీని నిలబెట్టలేకపోతున్నారు. ఇటీవల పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత విజయనగరం నేతలు మరింత సైలెంట్ అయ్యారు.


విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎచ్చెర్లలో కిమిడి కళా వెంకట్రావు దూకుడుగా పనిచేయడం లేదు. రాజాంలో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. గజపతినగరంలో అప్పలనాయుడు కొండపల్లి పెద్దగా యాక్టివ్‌గా లేరు. నెల్లిమర్లలో పతివాడ నారాయణస్వామిది అదే వరుస. ఇక విజయనగరంలో అశోక్ గజపతి రాజు కుమార్తె అతిథి కాస్త టీడీపీ తరుపున పనిచేస్తున్నారు. అటు బొబ్బిలిలో మాజీ మంత్రి సుజయకృష్ణరంగరావు సోదరుడు బేబీ నాయన యాక్టివ్‌గానే ఉన్నారు. అయినా సరే మొత్తం పార్లమెంట్ పరిధిలో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉండటంతో, టీడీపీ పుంజుకోలేకపోతుంది. ఏదేమైనా విజయనగరంలో టీడీపీని లేపడం నాగార్జునకు కష్టమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: